రాష్ట్రంలో ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్న మిర్చిరైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు డ్రామాలతో కాలం గడుపుతున్నారని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిధిలోని మార్క్ ఫైడ్ నుంచి మిర్చి కొనుగోళ్ళు చేయించకుండా, కేంద్రప్రభుత్వం కొనుగోళ్ళు చేయాలని చంద్రబాబు కోరడం అర్థరహితమని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కూటమి ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేయలేదని, దీనిని బట్టే మిర్చి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం తెట్టతెల్లమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.... రాష్ట్రంలో మిర్చి ధర దారుణంగా పతనమైంది. జనవరిలో హార్టీకల్చర్ విభాగం మిర్చి పంటకు సంబంధించిన నివేదికను ముందుగానే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో మిర్చిరైతులు సంక్షోభంలో ఉన్నారు, పెట్టుబడి వ్యయాలు పెరిగాయి, దిగుబడి తగ్గుతోంది, మిర్చి రేటు కూడా పడిపోతోంది, మార్కెట్ ఇంట్రవెన్షన్ లేకపోతే రైతులు దెబ్బతింటారు అని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది. అయినా కూడా సీఎం చంద్రబాబు స్పందించలేదు. చివరికి వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ గారు మిర్చి రైతుల బాధలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్ళడంతో రాష్ట్ర ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో స్పందించింది. కనీసం ఇప్పటికైనా మిర్చిరైతుల సమస్యను గుర్తించి మద్దతుధరకు కొనుగోళ్ళు చేస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఒక్క క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయలేదు. పైగా మిర్చి రైతులను ఆదుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు డ్రామాలు ప్రారంభించారు అని అన్నారు.
![]() |
![]() |