ఓటు దొంగల్ని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేట మొదలుపెట్టారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి గల్లంతు చేయించాలనే ఉద్దేశంతో కొంతమంది మోసపూరితంగా ఆన్‌లైన్‌లో ఫారం-7దరఖాస్తులు చేశారంటూ ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మోసపూరితంగా ఫారం-7 దరఖాస్తులు పెట్టిన ఘటనలపై బుధవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 322 కేసులు నమోదు కాగా...అందులో 235 కేసుల్లో 2,300 మంది దరఖాస్తుదారులను పోలీసులు గుర్తించారు. మిగతాకేసుల్లో ఉన్నదెవరో తేల్చే పనిలో పోలీసులున్నారు. వీలైనంత వేగంగా కేసుల దర్యాప్తును కొలిక్కొ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తన ఓటు తొలగించాలని కోరుతూ ఓటరు స్వతహాగా గానీ లేదా ఎవరైనా గ్రామంలో మృతిచెందిన వారి ఓట్లు, ఒకే పేరుతో జాబితాలో రెండుసార్లున్న పేర్లు, స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లు తొలగించాలని కోరుతూ ఫారం-7 దరఖాస్తు చేయచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ ఓటరు సర్వీసు పోర్టల్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి...దాని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది.
ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో గత పది రోజుల వ్యవధిలో 8.74 లక్షల ఫారం-7 దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. ఒకేసారి ఇన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటాన్ని అనుమానించిన ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఆయా గ్రామాల్లోని ఒకరో ఇద్దరో వ్యక్తులు వారి పేరిట ఈ నకిలీ దరఖాస్తులు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పోలీసుస్టేషన్లలో స్థానిక తహసీల్దార్లు ఫిర్యాదులు చేశారు. ఓట్ల తొలగింపునకు వచ్చిన లక్షల మోసపూరిత దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లో ఎన్నికల సంఘానికి అందాయి. ఈ నేపథ్యంలో అవి ఏ ఐపీ చిరునామాల ద్వారా అందాయో వివరాలివ్వాలని కోరుతూ పోలీసులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.ఆ ఐపీ చిరునామాలు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఇప్పటికే సీడాక్ కు లేఖ రాసింది. వందల సంఖ్యలో వచ్చిన ఈ కేసుల దర్యాప్తులో ఈ ఐపీ చిరునామాలే కీలకం కానున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.ఏ ఐపీ చిరునామానుంచి ఎన్ని గంటల సమయంలో ఎన్నిదరఖాస్తులు వచ్చాయనేది దాని ఆధారంగా తేలనుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించుకుని మోసపూరితంగా దరఖాస్తులుచేసిన వారిని గుర్తిస్తారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa