అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడు ఎవరిపై బాంబ్ వేస్తారోననే భయాందోళనలు నెలకొంటూనే ఉన్నాయి. అమెరికాలో ఉన్నవారికి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలపైనా ట్రంప్ నిర్ణయాల ప్రభావం పడుతోంది. ఇక అమెరికాను మళ్లీ ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలపడమే తన లక్ష్యమని ఇప్పటికే అనేక సార్లు చెప్పిన ట్రంప్.. ఈ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు అంతర్జాతీయంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం అమెరికా ప్రభుత్వం అందిస్తున్న యూఎస్ ఎయిడ్‌ను నిలిపివేస్తున్నట్లు ఇటీవలె ట్రంప్ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అయితే ఇప్పుడు ఆ ప్రభావం భారత్‌పైనా పడింది. యూఎస్ ఎయిడ్ నిలిచిపోవడంతో భారత్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన 3 క్లినిక్‌లు మూతపడినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
భారత్‌కు యూఎస్ ఎయిడ్ కింద వస్తున్న సాయం ఆగిపోవడంతో.. దేశంలో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన 3 క్లినిక్‌లు మూతపడినట్లు తెలుస్తోంది. ఇందులో 2021లో హైదరాబాద్‌లో మొట్టమొదటగా ఈ ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తోపాటు పూణే, కళ్యాణ్ నగరాల్లో కూడా ఈ ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత్‌లోని మూడు క్లినిక్‌లలో దాదాపు 5 వేల మందికి మెడికల్ ట్రీట్‌మెంట్ అందట్లేదని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఈ క్లినిక్‌లలో ట్రాన్స్‌జెండర్లకు హార్మోన్ థెరపీపై అవగాహన, మందులు, మానసిక ఆరోగ్యంతో పాటు హెచ్‌ఐవీ, ఇతర లైంగిక వ్యాధులపై కౌన్సెలింగ్ ఇస్తారు. అంతేకాకుండా సాధారణ వైద్య సంరక్షణ, న్యాయ సహాయం సహా వివిధ సేవలను ఇప్పటివరకు అందించారు. అయితే ఈ ట్రాన్స్‌జెండర్లకు సేవలు అందించడానికి ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం అమెరికా నుంచి యూఎస్ ఎయిడ్ నిధులు రాకపోవడంతో ట్రాన్స్‌జెండర్లకు ఈ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. భారత్‌లోని 3 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు మూసివేసినట్లు వస్తున్న వార్తలపై ప్రపంచ అపర కుబేరుడు, ట్రంప్ సర్కార్‌లో డోజ్ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ స్పందించారు. అమెరికా పౌరులు చెల్లిస్తున్న పన్నులతో ఏ దేశాలు బాగుపడుతున్నాయో.. ఎవరికి నిధులు వెళ్తున్నాయో ఇప్పటికైనా అర్థం అయ్యిందా అంటూ సోషల్ మీడియాలో పేర్కొనడం సంచలనంగా మారింది.
ప్రపంచంలోని దాదాపు 120 దేశాలకు మానవతా సాయం చేసేందుకు.. ఆయా దేశాల అభివృద్ధి, భద్రతకు భరోసా కల్పించేందుకు అమెరికా యూఎస్‌ఎయిడ్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ ప్రపంచ దేశాలకు వందల కోట్ల డాలర్లను ఏటా సాయంగా అందిస్తోంది. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్‌ను ఏర్పాటు చేశారు. యూఎస్ ఎయిడ్ వృథా ఖర్చులు ఎక్కువగా చేస్తోందని.. అది నేరగాళ్ల సంస్థ అని ఎలాన్ మస్క్ పేర్కొనడంతో కొంతకాలంపాటు యూఎస్‌ఎయిడ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో యూఎస్ ఎయిడ్‌లోని వేలాది మంది ఉద్యోగులను తొలగించి.. దాన్ని మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఇన్నేళ్లుగా యూఎస్ ఎయిడ్‌పై ఆధారపడిన దేశాలపై ఇప్పుడు తీవ్ర ప్రభావం పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa