ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎదుగుదలకు తానే కారణమంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా, నితీశ్ వ్యాఖ్యలకు లాలూ తనయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కౌంటర్ ఇచ్చారు. తన వల్లే రెండుసార్లు నితీశ్ కుమార్ సీఎం అయ్యారని, ఆ విషయం ఆయన మరిచిపోయినట్టు ఉన్నారని చురుకలంటించారు. ‘నితీశ్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసి, ఆయన పార్టీని కాపాడింది తానే.. ఆ విషయం ఆయన మరచిపోకూడదు’ అని అన్నారు.
తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శాసనసభలో నిన్న మాట్లాడుతూ తానే లాలూను సీఎం చేశానని చెప్పారు... ఆయన ఏం చేప్పారనేది పక్కనపెట్టండి... కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి.. ఆయన కంటే ముందే మా తండ్రి (లాలూ) ఎమ్మెల్యేగా రెండుసార్లు, ఎంపీగా ఒకసారి గెలిచారు. పలువురిని ప్రధానమంత్రులను చేశారు.. ఆ మాటకొస్తే నేనే ఆయనను (నితీశ్) రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశాను. ఆయన పార్టీ (జేడీయూ)ని కాపాడాను’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అలసిపోయిన (టైర్డ్) ముఖ్యమంత్రి, రిటైర్డ్ అధికారులు ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు.
2015 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన నితీశ్ కుమార్.. ఆర్జేడీతో మహాకూటమిగా ఏర్పడిన పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ 80 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. 71 సీట్లు గెలిచిన నితీశ్‌ను సీఎంను చేసింది. తర్వాత కొన్నాళ్లకే మహకూటమికి టాటా చెప్పి ఎన్డీయే గూటికి నితీశ్ చేరారు. 2021 ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. తమ పార్టీని చీల్చడానికి కమలనాథులు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ 2022 ఆగస్టులో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నారు. అనంతరం మహాకూటమిలో చేరి సీఎం పదవి చేపట్టారు. అయితే, ఇది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఏడాది తర్వాత జనవరి 2024లో మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు.
అంతకు ముందు ఆర్జేడీ ‘యువ చౌపల్’లో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ విజయం తథ్యమని అన్నారు. దేశంలోనే బిహార్ ‘యువప్రదేశ్’ అని, సరికొత్త బిహార్‌ను నిర్మించుకోవాలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 58 శాతం మంది 18 నుంచి 25 ఏళ్ల లోపు యువకులేనని, రెక్కలు అలిసిపోయిన రిటైర్డ్ సీఎం బిహార్‌కు అవసరం లేదని పరోక్షంగా నితీశ్‌పై తేజస్వీ విమర్శలు గుప్పించారు.
‘‘ఇప్పుడు అసమర్ధ ప్రభుత్వం మనకు అవసరం లేదు.. 60 ఏళ్లకు పదవీవిరమణ ఉంటుంది. మీకు 75 ఏళ్ల ముఖ్యమంత్రి కావాలా? ఇప్పుడు సమయం వచ్చింది. బిహార్‌ను ముందుకు తీసుకువెళ్లే కొత్త సైకిల్ కావాలి, పాతబడిపోయిన సైకిల్ కాదు’ అంటూ ఆర్జేడీ కార్యకర్తలకు తేజస్వి దిశానిర్దేశం చేశారు. వచ్చే నవంబరు డిసెంబరులో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa