ట్రెండింగ్
Epaper    English    தமிழ்

51 ఏళ్ల వయసులోనూ సచిన్ విధ్వంసం.. ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన టెండూల్కర్

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 08:08 PM

51 ఏళ్లు వచ్చేసరికి ఏ అథ్లెట్ అయినా.. దాదాపుగా ఆటకు పూర్తిగా దూరమవుతాడు. ఒకవేళ ఛారిటీ కోసమే.. మరే కారణంతో ఆడాల్సి వచ్చినా.. నామమాత్రపు ప్రదర్శన మాత్రమే చేస్తారు. కానీ సచిన్ టెండూల్కర్ అందుకు భిన్నం. 51 ఏళ్ల వయసులోనూ సచిన్.. బ్యాట్‌తో అద్భుతం చేస్తున్నాడు. తనను అందరూ ఎందుకు మాస్టర్ బ్లాస్టర్ అంటారో నిరూపించుకుంటున్నాడు.


సచిన్ టెండూల్కర్.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో భాగంగా ఇండియా మాస్టర్స్ తరఫున బరిలోకి దిగాడు. భారత జట్టుకు కెప్టెన్ కూడా అతడే. ఏడు దేశాల మాస్టర్స్ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇందులో ఇండియా మాస్టర్స్‌తో పాటు శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, దక్షిణఫ్రికా మాస్టర్స్, ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్లు ఉన్నాయి.


ఈ టోర్నీ 9వ మ్యాచ్ వడోదరలోని బీసీఏ స్టేడియంలో ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి.. ఒకప్పటి సచిన్‌ను గుర్తుకు తెచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సచిన్.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 33 బంతుల్లో 64 రన్స్ స్కోరు చేశాడు. అందులో నాలుగు సిక్స్‌లు, ఏడు ఫోర్లు ఉండటం గమనార్హం. ఈ ఇన్నింగ్స్ ద్వారా సచిన్ మళ్లీ పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చాడు. ఐదు పదుల వయసులోనూ ఎంత ఫిట్‌గా ఉన్నాడో చూపించాడు.


అయితే సచిన్ రాణించినా.. మిగతా బ్యాటర్లు తేలిపోవడంతో భారత్.. ఈ మ్యాచులో ఓడిపోయింది. ఈ మ్యాచులో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 269 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ 52 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బెన్ డంక్ 53 బంతుల్ 132 పరుగులు చేశాడు. 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా మాస్టర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. 95 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇండియా మాస్టర్స్ నాలుగు మ్యాచులు ఆడింది.. అందులో ఈ మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూసింది. అయినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa