అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళల సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ శ్రీ శక్తిపీఠం (తిరుపతి) ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం సాయంత్రం సహస్ర సువాసినీ పూజా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామి, డాక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి తెలిపారు. గురువారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిరువురూ మాట్లాడుతూ జగన్మాత అయిన శ్రీ లలితా పరమేశ్వరి దేవీ కరుణాకటాక్షాలు పొందాలంటే అందుకు తగిన మార్గం సువాసినీ పూజ ఒక్కటేనని అన్నారు. దేవతలు సైతం సంతోషించాలంటే స్త్రీలను పూజించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తూ సువాసినీలతో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి సహస్ర సువాసినీ పూజా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది మహిళలతో చతుర్వేద స్వస్తి, సామూహిక లలితా సహస్రనామ పారాయణ, భజన కోలాట బృందాల నృత్య ప్రదర్శన, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవం, సామూహిక ఉచిత సహస్ర సువాసినీ పూజ వంటి కార్యక్రమాలు జరుపుతామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు శ్రీ యంత్రం, అమ్మవారి ప్రసాదం అందజేస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబును కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. నగరవాసులు సహస్ర సువాసినీ పూజా మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, శక్తి సేన సభ్యులు మునిపల్లి శ్రీనివాస్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa