ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 01:10 AM

శ్రీకాకుళం –గజపతి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటుకు రెండు జిల్లాల ఉన్నత అధికారులు నిర్ణయించారు. రానున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు జిల్లాల సమన్వయ సమావేశం జరగాలని ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాతో ప్రక్కనున్న ఒడిషా రాష్ట్ర గజపతి జిల్లా ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం శుక్ర వారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అట్టాడ వెంకట రత్నం, ఎక్సైజ్ సూపరింటిండెంట్ కె.సుకేష్, పాలకొండ, పాతపట్నం, పలాస నియోజకవర్గాల రిటర్నింగు అధికారులు పాల్గొనగా., గజపతి జిల్లా కలెక్టర్ అనుపమ్ సాహా, పోలీసు సూపరింటిండెంట్ సారా శర్మ, ఎక్సైజ్ సూపరింటిండెంట్ ప్రదీప్ కుమార్ పాణీగ్రాహి పాల్గొన్నారు. ఇరు జిల్లాల సరిహద్దులలో చేపట్టాల్సిన చర్యల నిమిత్తం సమాచారం ఇచ్చి పుచ్చుకునే అంశంలో పక్కాగా ఉండాలని నిర్ణయించారు. ఇరు జిల్లాల అధికారులు సమాచారాన్ని అవసరాన్ని అనుసరించి తగినంత వేగంగా అందించుకొనుటకు నిర్ణయించారు. అంతర్రాష్ట్ర నేరస్తులు ఉంటే వారి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, అవసరమగు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు మద్యం, సారాయి, అధిక సంఖ్యలో ప్రజల రాకపోకలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరుగుటకు అన్ని చర్యలు చేపట్టుటకు ఇరు జిల్లాల అధికారులు నిర్ణయించారు.


పోలింగు రోజులలో అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. గజపతి జిల్లాతో పలాస, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల సరిహద్దులు ఉన్నాయని చెప్పారు. ఆర్.టి.సి వాహనాలు లేదా పాఠశాల వాహనాలను వినియోగించడాన్ని పరిశీలించాలని సూచించారు. పోలింగు రెండు జిల్లాలకు ఒకే రోజున జరిగిపుడు లేదా వివిధ తేదీల్లో జరిగినపుడు చేపట్టాల్సిన అంశాలను చర్చించారు. మద్యం, సారాయి, నగదు ఎక్కువ పరిమాణంలో రవాణా జరిగే అవకాశాలను పరిశీలించాలన్నారు. ప్రతి అంశంలో అత్యంత జాగరూకతతో గమనించాలని సూచించారు. అవసరమగు ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇరు జిల్లాల అధికారులు ఒకరితో ఒకరు నిత్యం సమాచార మార్పిడి జరుగుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa