ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 24 లక్షల ఓట్లను తొలగించి, ఎలా లబ్ధి పొందిందో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ 54 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా వైకాపా పార్టీ లబ్ధి పొందాలని టిఆర్ఎస్ పార్టీ కెటిఆర్ తో కలిసి కుట్రలు పన్నుతున్నట్లు ఏపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం నాడు జి.కొండూరు మండలంలోని వెంకటాపురం, ఇబ్రహీంపట్నం గ్రామాలలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో ఆయన పాల్గొని పలు సభలలో ప్రసంగించారు. ఓటు హక్కును తొలగించడం, రాజ్యాంగ హక్కును ఉల్లంఘించడమేనని అది పెద్ద నేరమని మంత్రి ఉమా తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో 7414 ఓట్లు తొలగించేందుకు ఫారం 7 ద్వారా తప్పుడు పేర్లతో, పోర్జరీ సంతకాలతో ఫిర్యాదులు చేసినట్లు చెప్పారు. శ్రీశైలం నీటి హక్కులను, నాగార్జున సాగర్ నీటి హక్కులను తాను అడుగుతున్నందువల్లనే టిఆర్ ఎస్ నాయకులు కుట్రతో తనపై పలు ప్రయోగాలు చేస్తున్నారని, ఇక్కడ పోటీ చేసే వైకాపా అభ్యర్ధి చరిత్రను కూడా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1999లో 23 వేల ఓట్లతో ఓడిపోయి పారిపోయిన అభ్యర్ధి ఏనాడూ ప్రజా సేవలో లేడని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో, అవినీతి వ్యాపారాలలో కోట్ల రూపాయలు గడించి సిబిఐ, ఈడి కేసులలో ముద్దాయిగా ఉన్నారని ఆరోపించారు. నందిగామలో పరిశ్రమ పెడితే అక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి వస్తుందని దుగ్ధతో మామగారి ఊరైన చిలకలూరిపేటలో స్పిన్నింగ్ మిల్ పెట్టారని దీనిని బట్టి ఆ అభ్యర్ధి నైజం ఏమిటో తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. నందిగామ ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ మంత్రి ఉమా తమకు పెద్దన్నలా తమకు అండగా ఉంటారని, మైలవరంలో మంత్రి ఉమా పోటీ చేయటం మైలవరం ప్రజల అదృష్టమని తెలిపారు. ఐతవరాన్నే అభివృద్ధి చేసుకోలేని వారు, మైలవరాన్ని ఏమి అభవృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రేయింబవళ్ళు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి ఉమాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మైలవరం ప్రజలను కోరారు. ఇంటింటికి తెదేపా కార్యక్రమం సందర్భంగా వెంకటాపురంలో గ్రామ ప్రజలు మంత్రి ఉమాకు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా హారతులు ఇచ్చి బంతిపూల వర్షం కురిపించారు. మంత్రి ఉమా ప్రతి మాటకు స్పందిస్తూ ఈలలతో, చప్పట్లతో ఆదరణ చూపారు._
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa