ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామానికొక మోడల్‌ ప్రైమరీ స్కూలును ఏర్పాటుచేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 11:54 AM

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మోడల్‌ ప్రైమరీ స్కూలును ఏర్పాటుచేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ తెలిపారు. తొలి విడతలోనే 10 వేల పాఠశాలలను మోడల్‌ స్కూల్స్‌గా మార్చాలనేది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలపై శుక్రవారం శాసనసభలో అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘1994 నుంచి 2004 వరకు రాష్ట్రంలో 2,53,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యాయి. వాటిలో 1,80,272 (71శాతం) టీడీపీ హయాంలోనే భర్తీ చేశారు. ఈ ప్రభుత్వంలోనూ 16,347 పోస్టులతో డీఎస్సీపైనే సీఎం తొలి సంతకం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నియమించడం వల్ల కొంత జాప్యం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 22,776 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. వాటిలో 16,347 ఖాళీలను భర్తీ చేస్తాం. ఎయిడెడ్‌ పాఠశాలల్లో 4,557 ఖాళీలు ఉన్నాయి’ అని తెలిపారు. జీవో 117ను రద్దుచేసి, ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు. ‘మేం అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. మాది పరదాలు కట్టుకుని, 144 సెక్షన్లు విధించే ప్రభుత్వం కాదు. అందుకే 117జీవోపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాం.అందులో వైసీపీ ఉపాధ్యాయ సంఘం కూడా పాల్గొంది. ఎలాంటి సూచనలు చేయకపోయినా నాతో ఫొటో దిగి వెళ్లారు. ఉపాధ్యాయులకు సీనియారిటీ జాబితా సిద్ధం చేస్తున్నాం. జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది. ఒక రోజు నిద్రలేచి ఐబీ సిలబస్‌ పెడదాం అంటాడు. దాని రిపోర్టు కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేశారు. మరొక రోజు ఆత్మలతో మాట్లాడి ఉదయాన్నే టోఫెల్‌ అంటాడు. అదీ సక్రమంగా అమలుకాలేదు. ఉపాధ్యాయులు, విద్యార్థులను సన్నద్ధం చేయకుండా వెయ్యి పాఠశాలల్లో సీబీఎ్‌సఈ పెట్టారు. ఎందుకైనా మంచిదని మేం మాక్‌ పరీక్ష నిర్వహిస్తే 90శాతం మంది ఫెయిలయ్యారు. మహిళల పట్ల గౌరవం పెంచేలా కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొస్తున్నాం. మహిళలను తక్కువ చేసేలా గాజులు తొడుక్కున్నారా? చీరలు కట్టుకున్నారా లాంటి వ్యాఖ్యలు కూడా వినపడకుండా చేయాలని ఆదేశించా. మహిళలను తక్కువ చేయడం సరికాదు. చిన్న వయసులోనే నాకు, బ్రాహ్మణికి వివాహం జరిగింది. అమెరికా వెళ్లి ఇద్దరం కలిసి పనిచేసుకున్నాం. ఇందులో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువని చూడకూడదు’ అని స్పష్టం చేశారు. చిక్కీలలో 36 శాతం నిధులు ఆదా చేసినట్లు లోకేశ్‌ చెప్పారు. ‘స్టూడెంట్‌ కిట్లలో 8 నుంచి 9శాతం ఆదా అవుతాయి. మొత్తంగా ఐదేళ్లలో కనీసం రూ.వెయ్యి కోట్లు ఆదా చేసి చూపిస్తాం. పిల్లల బ్యాగులు బరువుగా ఉండకూడదనే ఉద్దేశంతో సెమిస్టర్ల వారీగా పుస్తకాలు తయారుచేస్తున్నాం. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఏర్పాటుచేస్తాం. జూన్‌ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తిచేస్తాం’ అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa