మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తల సంఘం.. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా (ఎలీప్) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. అనకాపల్లిలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటవుతున్న తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పుడు మహిళలు కూడా అపారమైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులను మించిపోతున్నారని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అందుకే మహిళల కోసం వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచే పని) విధానాన్ని కూడా తీసుకువస్తున్నామని తెలిపారు. మహిళలు ఇంట్లో కూర్చునే మగవాళ్ల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులను తీసుకువస్తామని తెలిపారు.
![]() |
![]() |