ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 08:39 PM

కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబునాయుడు అడ్వాంటేజ్ అని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్ లో మంత్రి పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.యువగళం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను స్వయంగా తెలుసుకొని పరిపూర్ణత సాధించానని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తున్నానని చెప్పారు. రాజకీయాలకు పాదయాత్ర చాలా ముఖ్యమని, పాదయాత్ర రాజకీయాల్లో ఎంబీయే వంటిదని అన్నారు. పాదయాత్ర ద్వారా సమస్యలను మరింత బాగా అర్థం చేసుకోగలగుతున్నానని, నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నానని అన్నారు.'విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఇందులో మరో ఆలోచనకు తావులేదు. వైటూకే విప్లవంలో హైదరాబాద్, దేశం లబ్ధి పొందింది. ఇప్పుడు ఏపీ వంతు. నైపుణ్యం గలిగిన మానవ వనరులు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువస్తున్నాం. వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలో వచ్చింది. ఈ నెలాఖరునాటికి 350 సేవలను మనమిత్ర ద్వారా ప్రజలకు అందించనున్నాం. కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు,ల్యాండ్ రికార్డులను సులభంగా వాట్సాప్ సేవలో పొందవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌కు అందరూ సిద్ధంగా ఉండాలి' అని పేర్కొన్నారు.    కర్టాటకకు బెంగుళూరు, తమిళనాడు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ నగరాలు ఉన్నాయని, కానీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబే మాకు అడ్వాంటేజ్ అన్నారు. ఈ శుక్రవారం టాటా పవర్‌తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగిందని, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. నైపుణ్యగణన కంటే కుల గణన చాలా సులభమని, రాష్ట్రంలో నైపుణ్య గణనను ఛాలెంజ్‌గా తీసుకుని పని చేస్తున్నామని తెలిపారు.త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదని నారా లోకేశ్ అన్నారు. భారతదేశంలోని భాషా వైవిధ్యమే దానిని అడ్డుకుంటుందని తెలిపారు. ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నామని వెల్లడించారు. స్థానిక భాష తెలుగు అని, మాతృభాషల బలోపేతానికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. హిందీని బలవంతంగా రుద్దుతారని భావించడం లేదని పేర్కొన్నారు. నర్సులు, హోంకేర్‌ల కోసం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, కాబట్టి ఆ భాషలను కూడా నేర్చుకోవాలని అన్నారు. ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం అవసరమన్నారు. ఈ విషయంలో ఎన్డీయేకు తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా 23 కేసులు నమోదు చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసు నమోదు చేశారని తెలిపారు. వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో నిరసన తెలిపేందుకు కూడా అవకాశం లేదన్నారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. ఈరోజు ఉపముఖ్యమంత్రి కంటే జగన్‌కు భద్రత ఎక్కువగా ఉందని అన్నారు. వైసీపీ పాలనలో మద్యంలో అవినీతి, ఇసుక అక్రమ మైనింగ్ జరిగిందని, సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోందని తెలిపారు.1990ల్లో అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరిగేవని పేర్కొన్నారు. నేడు అలాంటి చర్చలు లేకపోవడం బాధాకరమని లోకేశ్ అన్నారు. జగన్ రెడ్డి వైసీపీకి నాయకుడని, శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పది శాతం ఉండాలని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని, తాము చట్టాలను గౌరవిస్తామని ఆయన అన్నారు. పార్లమెంట్, శాసనసభలో ఉండే నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తామని వ్యాఖ్యానించారు.1985 నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందని మంగళగిరి నుంచి తాను 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశానని గుర్తు చేశారు. కానీ 2024 ఎన్నికల్లో పోరాడి 91 వేల భారీ మెజార్టీతో గెలిచానని అన్నారు. ఏపీలో ఇది మూడో అత్యధిక మెజార్టీ అని గుర్తు చేశారు. కష్టమైన హెచ్ఆర్డీ శాఖను ఎంచుకున్నట్లు చెప్పారు. తన భార్య బ్రాహ్మణి తన క్రెడిట్ కార్డు బిల్లును చెల్లిస్తుందని చెప్పారు. మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ జరుపుకోవాలని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa