నైపుణ్యాభివృద్ధి శాఖలో భాగంగా ఉన్న సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఏపీ(సీడాప్) గత కొన్నేళ్లుగా యువతకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఉపాధి అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై) ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమాల అమలుకు 2016, 2019లో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ(పీఐఏ)లను ఎంప్యానెల్ చేశారు. మొత్తం 41 పీఐఏలు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందుకుగాను ఒక్కో వ్యక్తికి సగటున రూ.50వేల చొప్పున పీఐఏలకు వెళ్తాయి. యువతకు శిక్షణతో పాటు భోజనం, రవాణా ఖర్చులు, ఉపాధి కల్పన, ఉద్యోగం వచ్చాక మొదటి రెండు నెలల సహకారం అందించడం పీఐఏల బాధ్యత. వివిధ చేతి వృత్తులు, ఇతర కోర్సులపై 3, 4, 6 నెలల పాటు వేర్వేరు శిక్షణ కార్యక్రమాలను పీఐఏలు నిర్వహిస్తాయి. అయితే కొందరికి మేలు చేసే ఉద్దేశంతో అకస్మాత్తుగా 13 పీఐఏలను ఇటీవల సీడాప్ తొలగించింది. ప్రాజెక్టు అప్రూవల్ కమిటీ(పీఏసీ)లో పెట్టి తొలగించినట్లు వారికి సమాచారం ఇచ్చింది. అయితే తొలగించే ముందు వారికి కనీసం నోటీసులు కూడా జారీచేయలేదు. అలాగే వారి వివరణ కూడా తీసుకోలేదు. సీడాప్ అధికారులు సొంతంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉన్నతాధికారులు వ్యతిరేకించినట్లు తెలిసింది. కానీ మంత్రి నారా లోకేశ్ పేషీలోని ఓ అధికారి, సీడా్‌పలో ఓ కీలక అధికారి, మరో రాష్ట్ర స్థాయి మిషన్ మేనేజర్ కలిసి ఉద్దేశపూర్వకంగా ఈ పీఐఏలను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |