అగ్రరాజ్యం అమెరికాను పెను తుఫాను, టోర్నడోలు తీవ్రంగా వణికిస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు రావడంతో.. పెద్ద ఎత్తున ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్ల పైకప్పులు కూలిపోవడం, వాహనాలు సైతం పడిపోవడంతో.. మొత్తంగా ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన గవర్నర్ సారా హుకాబీ శాండర్స్.. అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలాగే ట్రంప్ సైతం దీనిపై స్పందించి.. రక్షణ చర్యలు చేపడతామని అన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అమెరికాను పెను తుఫాను వణికిస్తోంది. ఓవైపు తుఫాను, మరోవైపు టోర్నడోలు విరుచుకు పడుతుండగా.. బలమైన ఈదురు గాలులు వస్తున్నాయి. దీంతో ఇళ్ల పైకప్పులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు సైతం కూలిపోతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కూడా పడిపోతుండగా.. రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. మిస్సౌరీలోని బేకర్స్ ఫీల్డ్ ప్రాంతంలో టోర్నడో కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ హైవే పెట్రోల్ అధికారులు వెల్లడించారు. అలాగే కాన్సాస్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోయారు.
అలాగే మిసిసిపీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు ఆచూకీ గల్లంతు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక టెక్సాస్‌లో జరిగిన వాహన ప్రమాదాల వల్ల నలుగురు చనిపోగా.. ఆర్కాన్సాస్ రాష్ట్రంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 29 మంది గాయపడ్డారు. ఇలా 8 కౌంటీల్లో 50 మందికి పైగా గాయపడగా.. రాష్ట్ర వ్యాప్తంగా 16 కౌంటీల్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు వివరించారు. అనేక ఇళ్లతో పాటు, విద్యుత్ లైన్లు, చెట్లు కూలిపోయినట్లు వెల్లడించారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని.. ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వివరించారు.
ఇదంతా ఇలా ఉండగా.. మరిన్ని టోర్నడోలు వచ్చే అవకాశం ఉందని.. అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండొచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం చెబుతోంది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో దీని ముప్పు ఎక్కువగా ఉందని వివరించింది. ప్రజలతో పాటు అధికారులు సైతం జాగ్రత్తగా ఉండాలని.. ముందస్తు చర్యల వల్లే ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చని చెబుతున్నారు.
![]() |
![]() |