ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి నారా లోకేశ్ మండలిలో పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్ లో భాగంగా సోమవారం మండలిలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. తమ ప్రభుత్వం గతంలో, ప్రస్తుతం కూడా గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తీసుకొచ్చిన యూనివర్సిటీల చట్టం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. అయితే, గత ప్రభుత్వం ఈ చట్టానికి పలు సవరణలు చేసి ప్రైవేటు యూనివర్సిటీలను ఏపీకి రాకుండా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు.ప్రధానంగా కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీస్ నిబంధన తీసుకొచ్చారని చెప్పారు. కనీసం 30 శాతం కోర్సు.. టై అప్ అయిన ఫారిన్ యూనివర్సిటీలో చదవాలని రూల్ పెట్టారు. అయితే, ఇలాంటి ఒప్పందం చేసుకోవాలంటే న్యాక్ అక్రిడేషన్ తప్పనిసరి అని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయన్నారు. కనీసం రెండు గ్రాడ్యుయేట్ బ్యాచ్ లన్నా, 6 ఏళ్ల ఎగ్జిస్టెన్సీ ఉండాలని, వెయ్యికి పైగా పబ్లికేషన్స్ చేసుండాలి, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్ స్టిట్యూషన్స్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ లు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెబుతోందన్నారు. యూనివర్సిటీల చట్టానికి ఐదేళ్ల పాలనలో ఐదుసార్లు సవరణలు చేసిందన్నారు. దీంతో ఈ చట్టం కాస్తా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు వ్యతిరేకంగా మారిందని మంత్రి వివరించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 36.5 శాతంగా ఉందని, పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఈ రేషియో 47 శాతం, కేరళలో 48.3 శాతంగా ఉందని మంత్రి లోకేశ్ వివరించారు. కాగా, యూనివర్సిటీలు నిర్వహించే పరీక్షలకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.వర్సిటీలు వేటికవే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల రిక్రూట్ మెంట్ విషయంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించినట్లు మంత్రి తెలిపారు. బిట్స్ తో పాటు పలు యూనివర్సిటీలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల, యూనివర్సిటీల చట్టానికి వైసీపీ సర్కారు చేసిన సవరణల వల్ల ప్రైవేటు యూనివర్సిటీలకు అవరోధాలు ఏర్పడుతున్నాయని వివరించారు. వీటిని తొలగించేందుకు యూనివర్సిటీల చట్టానికి మరోమారు సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేశ్ మండలిలో పేర్కొన్నారు.2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన కోసం ప్రత్యేక చట్టం తీసుకు వచ్చింది. అందులో భాగంగానే విట్, ఎస్ఆర్ఎం, సెంచూరియన్, క్రియా యూనివర్సిటీ రాష్ట్రానికి వచ్చాయి. విట్, ఎస్ఆర్ఎం అమరావతిలో, సెంచూరియన్ విజయనగరంలో, క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో ఏర్పాటయ్యాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు ఆనాడు కూడా కట్టుబడి పనిచేశామనేందుకు ఇదొక ఉదాహరణ.ఏపీసెట్ ద్వారా 35శాతం సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. మిగతా 65 శాతం సీట్లు మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేటు విశ్వవిద్యాలయాల యాక్ట్ ను సమీక్షిస్తున్నాం. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో మేం చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ల విషయానికి వస్తే గవర్నెన్స్ కోసం గ్లోబల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్(గిగ్) ను కేబినెట్ లో ప్రతిపాదించాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పీహెచ్ డీ విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నారు. ఇందుకు పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ ఒక కారణం. దీనిపై అధ్యయనం చేస్తున్నాం. విశాఖలో ఏఐ యూనివర్సిటీ నెలకొల్పుతాం. ప్రభుత్వ వర్సిటీల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.గంజాయి, డ్రగ్స్ అణచివేత విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ఈగల్ విభాగాన్ని ఏర్పాటుచేసి, సిబ్బందికి అదనంగా 30శాతం జీతాలు ఇస్తూ జీవో జారీచేశాం. ప్రతి యూనివర్సిటీ, స్కూల్స్ లో ఈగల్ కమిటీలు ఏర్పాటుచేసి చైతన్యం తీసుకువస్తాం.
![]() |
![]() |