26/11 ముంబయి దాడుల సూత్రధారి, లష్కరే తొయిబా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు అబూ ఖతల్‌ను గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమైన విషయం తెలిసిందే. అయితే, సయీద్‌కు కూడా అలాంటి గతే పడుతుందని విదేశీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ నిపుణుడు రవీంద్ర సచ్‌దేవా ఏఎన్ఐతో మాట్లాడుతూ.. అబూ ఖతల్ హత్య అనేది లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ఇతర ఉగ్రవాదులను ట్రాక్ చేస్తున్నవారు వారిని సమీపిస్తున్నట్టు సంకేతాలు వెలువరిస్తోందని అన్నారు.
‘హఫీజ్ సయీద్ ప్రదాని అనుచరుడు హతమయ్యాడంటే.. ఉగ్రవాదుల కదలికలను నిశితంగా గమనిస్తోన్నవారు వారికి చేరువయ్యారని అర్ధం.. కత్తిపట్టినోడు అదే కత్తికి బలవుతాడనే సామెత ఉంది.... హఫీజ్ సయీద్ కూడా ఇలాంటి విధిని ఎదుర్కోవలసి రావచ్చు... అబూ ఖతల్ కశ్మీర్, రాజౌరి, పూంచ్, పీఓకేలలో అనేక దాడుల్లో పాల్గొన్నాడు..’ అని సచిదేవ్ పేర్కొన్నారు. అనుచరుడి హత్యతో తన భధ్రతను సయీద్ మరింత కట్టుదిట్టం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇప్పటికే తనకు రక్షణగా ఉన్న పాకిస్థాన్ ఆర్మీ సాయం కోరే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘హఫీజ్ సయీద్ నెక్ట్స్ స్టెప్ తన భద్రతను పెంచుకోవడం.. తనకు రక్షణ కల్పిస్తోన్న పాకిస్థాన్ ఆర్మీ సాయం కోరడం.. ఈ సంఘటన వెనుక ఎవరున్నారో ఎవరూ చెప్పలేరు.. కానీ భారత్‌ను అప్రతిష్టపాలు చేయడానికి పాకిస్థాన్ అధికారులు కూడా ఇలా చేసి ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు. ఇటీవల బలూచిస్థాన్‌లో రైలు హైజాక్ ఘటనను భారత్‌తో పాక్ ముడిపెట్టిన విషయం తెలిసిందే.
కాగా, అబు ఖతల్‌పై కాల్పుల సమయంలో గాయపడిన మరో వ్యక్తి ప్రస్తుతం పాకిస్థాన్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని నివేదికలు అందుతున్నాయని, అతడు హఫీజ్ సయీద్ కావచ్చని రిటైర్డ్ ఆర్మీ మేజరల్ జనరల్ ధ్రువ్ సి కోటోచ్ అయ్యిండొచ్చని చెప్పడం గమనార్హం. ‘ఖతల్‌పై కాల్పుల సమయంలో గాయపడిన వ్యక్తి పాకిస్థాన్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అయితే, అతడి గుర్తింపు గురించి పాకిస్థాన్ బయటపెట్టకపోవడంతో సంచలనం సృష్టిస్తోంది.. అతడు హఫీజ్ సయీద్ అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి’ అని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, భారత నౌకదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనుకున్న పాక్ మతపెద్ద కూడా ఇటీవలే హత్యకు గురైన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ సైన్యం రక్షణ కల్పిస్తున్నప్పటికీ అక్కడ ఏ ఉగ్రవాదీ సురక్షితంగా లేడని, వారిని వేటాడి చంపడం ఖాయమని అన్నారు. ‘ అతడు హఫీజ్ సయీదా? కాదా? అనేది ముఖ్యం కాదు.. రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోలేడు.. పరారీలో ఉన్న అతడు.. హిట్ లిస్ట్‌లో ఉండటంతో పాకిస్థాన్ సైన్యం అతడికి భద్రత కల్పిస్తున్నప్పటికీ అక్కడ ఏ ఉగ్రవాది కూడా సురక్షితంగా లేడు..వారిని వెంటాడి వేటాడి మట్టుబెడుతున్నారు’ అని వివరించారు.
![]() |
![]() |