ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఓ ఆకతాయి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పరీక్ష కేంద్రం గోడపై పుష్ప సినిమా డైలాగును అనుకరిస్తూ, ఇన్విజిలేటర్ ను కించపరిచేలా రాయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ సదరు రాతలకు సంబంధించిన ఫొటోను ఓ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.పుష్ప 2 సినిమాలోని ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటూ’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ను సదరు ఆకతాయి పేరడీ చేశాడు. ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్.. నీయవ్వ తగ్గేదేలే..’ అంటూ గోడపై రాశాడు. దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ‘ఇదీ నేటి యువత తీరు’ అంటూ ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. పనికిమాలిన సినిమాలు చూస్తే పిల్లలు ఇలానే తయారవుతారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, ఇలాంటివి జోక్‌గా తీసుకోవడం సరికాదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |