ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని దక్కించుకుంది. ట్రోఫీ విజేత భారత్‌కు గురువారం బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ. 58 కోట్ల క్యాష్ రివార్డును ప్రకటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.‘రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక్క ఓటమి లేకుండా కప్‌ను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో విజయం సాధించి ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన టీమ్‌ఇండియా.. పాకిస్థాన్, న్యూజిలాండ్ కూడా చిత్తు చేసింది. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఫైనల్‌కు చేరుకుంది. అక్కడా కివీస్‌ను ఓడించి కప్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను దక్కించుకున్న టీమ్‌ఇండియా ఆటగాళ్ల నిబద్ధతను బోర్డు గుర్తించకుండా ఉండదు. వారి శ్రమకు ఈ క్యాష్ ప్రైజ్‌ను అందిస్తుంది. ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బందికి నజరానా ప్రకటించడం ఆనందంగా ఉంది. దీనికి వారంతా అర్హులే. అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ ఉన్నతస్థానాలకు దూసుకెళ్తోంది’’ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
![]() |
![]() |