ప్రముఖ నటుడు చిరంజీవి ప్రస్తుతం యూకేలో పర్యటిస్తున్నారు. ఆయనకు నిన్న యూకే హౌస్ ఆఫ్ కామన్స్ లో ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఘనసన్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే బ్రిడ్జి ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారంతో చిరును గౌరవించింది. తన పర్యటనలో భాగంగా చిరంజీవి అక్కడి అభిమానులతో సమావేశమయ్యారు. అభిమానులతో ముచ్చటించారు. మీ ఇళ్లకు వచ్చి మీ అతిథ్యం స్వీకరించాలని ఉందంటూ కోరికను వ్యక్తం చేశారు. "మీరంతా నా తమ్ముళ్లు, చెల్లెళ్లు. మీరు సాధించే ప్రతి విజయం నా విజయంగానే భావిస్తాను. ఏదో ఒక సందర్భంలో నా సినిమా చూసి స్పందించిన వారే మీరంతా. మీ అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మీ ఇళ్లకు వచ్చి మీతో మాట్లాడాలని, మీ చేతి వంట తినాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా వస్తాను" అని చిరంజీవి అన్నారు. ఇక, ఏపీ మంత్రివర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ ఏమన్నారో చిరంజీవి అభిమానులకు వివరించారు. "పవన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ నాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చిరంజీవి ఆయన్ని ఇంటికి పిలిచి ఆశీర్వదించిన తీరు చూసి కన్నీళ్లు వచ్చాయని, అన్నదమ్ములు ఎలా ఉండాలో చిరంజీవి చూపించారని మోదీ కొనియాడారు" అని చిరంజీవి వివరించారు.
![]() |
![]() |