శాసనసభ, మండలి సభ్యులు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో హాస్యం కాస్తా అపహాస్యం అయ్యిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత వైయస్ జగన్‌పై కొందరు చేసిన నీచమైన అనుకరణలను చూసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వికృతానందం పొందారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు ఒక హుందాతో కూడిన ప్రవర్తనతో అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి అసహ్యాన్ని కలిగించేలా వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తున్నారనే స్పృహ కూడా కూటమి నేతలకు లేకపోవడం దారుణమని అన్నారు.అయన మాట్లాడుతూ..... సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడైనా అహ్లాదాన్ని పంచుతాయి. కానీ ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమం దానికి భిన్నంగా నిర్వహించారు. కొందరు సభ్యులు హద్దుమీరి చేస్తున్న అపహాస్యపు చేష్టలపై సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పుకునే చంద్రబాబు వారిని నియంత్రించడంలో విఫలమయ్యారు. పైగా ఆ వికృత చేష్టలను చూసి ఆయన సంతోషంతో తబ్బిబ్బయ్యారు. ప్రజాజీవితంలో ఉన్నవారు అందరికీ ఆదర్శంగా ఉండాలంటూ, ప్రసంగాల్లోనూ సభ్యతతో మాట్లాలంటూ నీతులు చెప్పడం కాదు, దానిని ఆచరించాలని, తోటి వారు ఏదైనా సందర్భంలో హద్దుమీరుతుంటే వారిని నియంత్రించాలనే విషయం చంద్రబాబు మరిచిపోయారా? వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కొందరు సభ్యులు వ్యవహరించిన తీరు చాలా బాధాకంగా ఉంది. వైయస్‌ఆర్‌సీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు వస్తే, జనసేన కనీసం ఒక్కసీటు కూడా గెలవలేక పోయిందనే విషయం మరిచిపోయారు అని గుర్తుచేశారు.
![]() |
![]() |