తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని సైతం వాడుకునే దౌర్భాగ్యం చంద్రబాబు సొంతమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ పరమ పావనమైన శ్రీవారి వారి క్షేత్రంలోనూ పచ్చి అబద్దాలను అలవోకగా చెప్పే చంద్రబాబుకు ఆధ్యాత్మికత, పవిత్రతపై ఎటువంటి నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా చెప్పుకుంటూ రాజకీయమే పరమావధిగా సనాతన ధర్మాన్ని, స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. అయన మాట్లాడుతూ.... దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా తిరుమల అన్నదానానికి చంద్రబాబు విరాళం ఇచ్చారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ.. పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతంలో ఆరోపణలు చేసిన శ్రీవాణి ట్రస్ట్‌ను కొనసాగిస్తామని ప్రకటించారు. వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్ అనేది ప్రారంభమైందే టీడీపీ ప్రభుత్వంలో. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ ఈ ట్రస్ట్‌ను సమర్థంగా నిర్వహించడం వల్ల దేశ వ్యాప్తంగా 3600 ఆలయాలను ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో నిర్మించడం జరిగింది. అటువంటి ట్రస్ట్‌పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనతో పాటు పవన్ కల్యాణ్ ఇదే తరహాలో అభాండాలు వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విజిలెన్స్ విచారణ వేసి, ఇప్పటి వరకు ఒక్క చిన్న తప్పును కూడా నిరూపించలేకపోయారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ ట్రస్ట్ గొప్పతనంను గుర్తించి, ట్రస్ట్ ద్వారా విక్రయిస్తున్న టిక్కెట్ల సంఖ్యను కూడా పెంచారు. తాము శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారు. శ్రీవాణి ట్రస్ట్‌ను కొనసాగిస్తూనే ఆలయాల నిర్మాణానికి మరో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది చంద్రబాబు ద్వంద విధానాలకు నిదర్శనం అని అన్నారు.
![]() |
![]() |