రాష్ట్రంలో దివ్యాంగుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తూ పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైయస్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దాదాపు రెండు లక్షల పెన్షన్లను తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగ పెన్షనర్లపై వేధింపులు ప్రారంభించారని అన్నారు. అయన మాట్లాడుతూ...... గత వైయస్ జగన్‌గారి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాలతో దివ్యాంగ పెన్షన్లను ముడిపెడుతూ పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించే ప్రయత్నం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.25 లక్షల మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు. పాక్షిక వైకల్యంతో రూ. 6 వేల పింఛన్లు పొందుతున్నవారు సుమారు 8 లక్షల మంది ఉండగా వైకల్య శాతం పునఃపరిశీలన పేరుతో దాదాపు 2 లక్షల మందిని పరీక్షించి 1.50 లక్షల మంది వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. మిగిలిన వారి పింఛన్లను హోల్డ్‌లో పెట్టారు. మొదటి దశలో రూ. 15 వేలు పింఛన్ తీసుకునే మంచానికి పరిమితమైన సుమారు 25 వేల మంది ఇంటికి వెళ్లి వైకల్య శాతం పునఃపరిశీలన చేశారు. ప్రభుత్వం టెస్టులు చేసి 20 వేల మందినే అర్హులుగా గుర్తించి మరో 5 వేల మందిని పాక్షిక వైకల్యం ఉన్నవారిగా నిర్ధారించారు. ఈ మేరకు వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. మొత్తం పెన్షన్లలో మిగతా 6 లక్షల మందిని కూడా ఇలాగే పరీక్షించి దాదాపు 2 లక్షల పింఛన్లకుపైగా తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని చూసి దివ్యాంగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పింఛన్లనే నమ్ముకున్న దివ్యాంగులు ఆకలితో అలమటించే రోజులు రాబోతున్నాయా అనే అనుమానం కలుగుతోంది అని అన్నారు.
![]() |
![]() |