అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. వర్జీనియాలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోకి తుపాకితో చొరబడిన ఆగంతకుడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. దుకాణం తెరిచిన కొద్దిసేపటికే లోపలికి దూరిన నిందితుడు.. అక్కడ వర్కర్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్ (56), అతడి కుమార్తె ఊర్మి తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్ ఘటనా స్థలిలోనే మృతిచెందాడని చెప్పారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఊర్మి చనిపోయినట్టు పేర్కొన్నారు. నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ (44)ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
గురువారం ఉదయం మద్యం కొనేందుకు డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కు వెళ్లిన నిందితుడు.. ముందురోజు రాత్రి ఎందుకు మూసేశారని ప్రశ్నించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న తుపాకితో ప్రదీవ్ పటేల్, ఊర్మిపై కాల్పులు జరిపాడు. గుజరాత్‌లోని మెహసనా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్.. తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువులకు చెందిన డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు.
వారి బంధువు పరేశ్ పటేల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సోదరుడి భార్య, ఆమె తండ్రి షాపులో పనులు చేసుకుంటుండగా ఒకరు వచ్చి కాల్పులు జరిపాడు.. ఏం జరిగిందో నాకు తెలియదు.. ’ అని అన్నారు. హతుడు ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు.
నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్, ఆయుధ చట్టం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా, ఈ ఘటన అమెరికాలోని భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొద్ది నెలల కిందట నార్త్ కరోలినాలోని కన్వీనియస్ స్టోర్‌లో భారత సంతతికి చెందిన మైనాక్ పటేల్ (36)ను దోపిడీకి వచ్చిన ఓ దుండుగుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
![]() |
![]() |