అవిసె గింజల్ని ఎంతో కాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు. అవిసె గింజలతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని చాలా మంది స్నాక్ ఐటమ్‌లా తింటున్నారు. కొందరు నేరుగా తింటుంటే, కొందరు అవిసె గింజల్ని పొడిలా చేసుకుని పాలు లేదా నీళ్లలో కలిపి తీసుకుంటున్నారు. మరికొందరు అవిసె గింజలు, బెల్లం కలిపి లడ్డూల్లా చేసుకుని తింటున్నారు. కరోనా తర్వాత అవిసె గింజల వాడకం బాగా పెరిగింది. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాలా మంది అవిసె గింజల్ని తింటున్నారు. అయితే, అవిసె గింజలతో చట్నీ చేసుకుని తింటే రుచికి రుచి, గుండెకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. అవిసె గింజలతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
అవిసె గింజలతో మేలు
అవిసె గింజలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవిసె గింజల్లో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మలబద్ధకం, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. ఇలాంటి అవిసె గింజలతో చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే
అవిసె గింజల చట్నీ కోసం కావాల్సిన పదార్థాలు
* ఒక కప్పు అవిసె గింజలు
* ¼ కప్పు వేరుశెనగలు
* 5 నుండి 6 మొత్తం ఎర్ర మిరపకాయలు
* వెల్లుల్లి 8 నుంచి 9 రెబ్బలు
* 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు
* రుచికి ఉప్పు
* ½ నిమ్మకాయ రసం
* 5-6 కరివేపాకు
* అర టీస్పూన్ ఆవాలు
తయారీ విధానం
* ముందుగా, అవిసె గింజలను తక్కువ మంట మీద వేయించి, చల్లబరచడానికి పక్కన పెట్టుకోండి.
* దీని తర్వాత వేరుశెనగలను కూడా వేయించాలి.
* ఇప్పుడు మొత్తం ఎర్ర మిరపకాయలను గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, వెల్లుల్లి రెబ్బలను తొక్క తీయండి.
* ఆ తర్వాత తెల్ల నువ్వులను కూడా విడిగా వేయించాలి.
* తరువాత పైన చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
* దీని తరువాత దానికి ఉప్పు, నిమ్మరసం కలపండి. ఇంకేముంది చట్నీ రెడీ అయినట్టే.
ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే
* ఈ చట్నీ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే దానికి పోపు పెట్టాలి. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్‌లో ఆవాలు వేయించాలి. అందులో ఎండి మిర్చి, కరివేపాకు వేయండి.
* ఇప్పుడు పోపు మిశ్రమాన్ని చట్నీలో వేసి బాగా మిక్స్ చేయండి.
* దోస, ఇడ్లీ, ఊతప్పం, పరాఠ, కిచిడి, అన్నం వంటి వాటిలో వేడి వేడిగా తింటే రుచి అదుర్స్ అంతే.
* వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ మజానే వేరు.
అవిసె గింజల చట్నీతో ప్రయోజనాలు
ఈ పచ్చడి గుండెకు మేలు చేస్తుంది. ఈ చట్నీలో వెల్లుల్లి, మిరపకాయలను జోడించడం ద్వారా, వాటి లక్షణాలు కలిసిపోయి దాని ప్రయోజనాలను రెట్టింపు చేస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3, వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పచ్చడి రుచికి రుచిని ఇవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
![]() |
![]() |