ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన‌రాజ‌ప్ప చిరుమంద‌హాసం.. ఓట‌మెరుగ‌ని గెలుపు ఖాయం..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 08:13 PM

ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మ‌కాయ‌ల‌ చిన రాజ‌ప్ప మంచి జోష్ మీదున్నార‌ని తెలిసింది. వాస్త‌వానికి ఎన్నిక‌ల కోడ్ అమల్లోకి వ‌చ్చింది. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక‌, నాయ‌కుల‌కు ఒక ప‌క్క బాహ్య వాతావ‌ర‌ణంలో ఎండ వేడికి చెమ‌ట‌లు ప‌డుతుంటే.. మ‌రోప‌క్క‌, ఎన్నిక‌ల వేడితో మ‌రింత ఉక్క‌బోత క‌నిపిస్తోంది. అయితే, చిన‌రాజ‌ప్ప మాత్రం ఆనందంగా ఉన్నార‌నేది ప్ర‌స్తుత టాక్‌. మ‌రి దీనికి రీజ‌న్ ఏంటి? ఆయ‌న ఎందుకు ఆనందంగా ఉన్నార‌నేది ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. తూర్పుగోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన అసెంబ్లీ నియోజ‌వ‌క‌ర్గం పెద్దాపురం. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో చిన‌రాజ‌ప్ప విజ‌యం సాధించారు. ఇక‌, ఈ టికెట్‌ను ఆయ‌న‌కే క‌న్ఫ‌ర్మ్ చేస్తూ.. సీఎం చంద్ర‌బాబు కూడా ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. దీంతో మ‌రోసారి చిన‌రాజ‌ప్ప ఇక్క‌డ నుంచి పోటీకి స‌ర్వం సిద్ధం చేసు కుంటున్నారు.
ఇక్క‌డ ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం కూడా చిన‌రాజ‌ప్ప‌కు క‌ల‌సి వ‌స్తోంది. ఇక్క‌డ నుంచి టీడీపీ నేత‌ల్లో కొద్ది మేర‌కు అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల చంద్ర‌బాబు వారితో చ‌ర్చించి అసంతృప్తిని పార‌ద్రోలారు. దీంతో ఇక్క‌డ టీడీపీ రాజ‌కీయాలు చాలా వ‌ర‌కు శాంతించాయి. ఇక‌, చిన‌రాజ‌ప్ప విష‌యానికి వ‌స్తే.. పార్టీకి ఈయ‌న వీర విధేయుడు. గ‌తంలో అనేక పార్టీల నుంచి పిలుపు వ‌చ్చినా కూడా ఈయ‌న ఆయా పార్టీల్లోకి వెళ్ల‌కుండా టీడీపీలోనే ఉండిపోయారు. ఇక‌, పెద్దాపురం నుంచి గెలిచిన త‌ర్వాత ఇక్క‌డ అభి వృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రుగులు పెట్టించారు. ర‌హ‌దారులు, తాగునీరు, ఇంటింటికీ మ‌రుగుదొడ్డి వంటి కీల‌క విష‌యాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. సంక్షేమానికి పెద్ద‌పీట వేశారు. ఇక్క‌డి అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక‌టి నినాదంతో ముందుకు దూసుకుపోయారు.
దీంతో ఇప్పుడు పెద్దాపురంలో చిన‌రాజ‌ప్ప పేరు బాగానే వినిపిస్తోంది. పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌కు జై కొడుతున్నారు. నిజానికి పెద్దాపురంలో స్థానికేత‌రుడు అయిన చిన‌రాజ‌ప్ప‌కు ఇక్క‌డ నాయ‌కులు తొలుత క‌లిసిరాలేదు. అయితే, ఆయ‌న వ్య‌వ‌హార శైలి, చిన్న అవినీతి కూడా లేక‌పోవ‌డం, ఆఖ‌రుకు విప‌క్షం వైసీపీకి చెందిన ప‌త్రిక‌లో సైతం ఎంతో మంది టీడీపీ నేత‌లకు సంబంధించి వ్య‌తిరేక వార్త‌లు వ‌చ్చినా.. చిన‌రాజ‌ప్ప‌కు సంబంధించి ఒక్క ముక్క కూడా వ్య‌తిరేకంగా రాసేందుకు సాహ‌సం చేయ‌లేని ప‌రిస్థితి ఉండ‌డం వంటివి ఆయ‌న నిబ‌ద్ధ‌త‌కు , అంకిత భావంతో కూడిన ప్ర‌జా సేవ‌కు ద‌ర్ప‌ణంగా నిలుస్తున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ చిన‌రాజ‌ప్ప విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌నే స‌ర్వేలు వెలువ‌డుతున్నాయి. తాజాగా లోక‌ల్ న్యూస్ కూడా చిన‌రాజ‌ప్ప‌కు అనుకూలంగా ఉండ‌డంతో ఆయ‌న ఆనందంతో ఉక్కిరిబిక్కిరికి లోన‌వుతున్నార‌ట‌. ఎన్నిక‌ల‌కు ఇంకా పూర్తిస్థాయిలో నోటిఫికేష‌న్ కూడా వెలువ‌డ‌క ముందుగానే ఇలా త‌న గెలుపు ఖాయం కావ‌డంపై ఆయ‌న చిరుమంద‌హాసంతో ఉన్నార‌ని అంటున్నారు స్థానికులు. సో.. చిన‌రాజ‌ప్ప చిరుమంద‌హాసం వెనుక అస‌లు స్టోరీ ఇద‌న్న‌మాట‌!!


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa