తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ప్రత్యేక సందేశం వెలువరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఇతర నేతలు పార్టీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఒక మహనీయుడి విజన్ కు ప్రతిరూపమే తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. అనేక విప్లవాత్మక పథకాలతో పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అటువంటి చారిత్రాత్మక పార్టీకి మనందరం వారసులం నేను టీమ్ లీడర్ ను మాత్రమే అని చంద్రబాబు స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారని, అలాంటి వాళ్లందరూ కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీని ఏమీ చేయలేకపోయారని, పార్టీ పెట్టిన ముహూర్త బలం అటువంటిది అని అన్నారు. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణయుగం అనే రోజులు శాశ్వతంగా వస్తాయని పేర్కొన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. "2024 ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించాయి. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని నిలబెట్టాలన్న ఆలోచనతో కూటమిగా ఏర్పడ్డాం. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అఖండ విజయాన్ని సాధించాం. 93 శాతం స్ట్రయిక్ రేట్ తో అద్భుత విజయం నమోదు చేశాం. ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదురైనా కార్యకర్తలు ధైర్యాన్ని వీడలేదు. నేతలను, పార్టీని ఆర్థికంగా దెబ్బతీసి కుంగదీయాలని ఎన్నో కుట్రలు పన్నారు. ఆస్తులు విధ్వంసం చేసినా ఎవరికీ భయపడలేదు. ప్రతి కార్యకర్త త్యాగాన్ని గుర్తుంచుకుంటాం. కార్యకర్తలు హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేదే ఉండదు" అని చంద్రబాబు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa