ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. అనుమానిత లింకులపై క్లిక్ చేయవద్దని ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోన్నప్పటికీ, ఎంతోమంది ఆ లింకులపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా, యూపీలోని సోన్‌భద్రలో ఒక ఉద్యోగి ఓ లింకుపై క్లిక్ చేసి రూ. 2.27 కోట్లు నష్టపోయాడు.నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పనిచేస్తోన్న యుగల్ కిశోర్ తివారి అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట భారీ మొత్తంలో నష్టపోయినట్లు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 13న తివారికి వాట్సాప్‌లో ఒక లింకు వచ్చిందని, దానిపై క్లిక్ చేసి మోసపూరిత ట్రేడింగ్ అప్లికేషన్ యాప్ డౌన్‌లోడ్ చేశాడని పోలీసులు తెలిపారు. అతడికి రెండు డీమ్యాట్ ఖాతా నెంబర్లు వచ్చాయని తెలిపారు. స్టాక్ ట్రేడింగ్ నుంచి మంచి లాభాలు వస్తాయని లింక్ పంపిన వారు నమ్మబలికారని, వారి మాటలు నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు. 24 వేర్వేరు ట్రాన్సాక్షన్లలో రూ.1.46 కోట్లు, ఆ తర్వాత తన మేనకోడలి ఖాతా నుంచి 10 వేర్వేరు ట్రాన్సాక్షన్లలో రూ. 81 లక్షలు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
![]() |
![]() |