భారత క్రికెట్ వర్గాల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ 2025/26 దేశవాళీ క్రికెట్ సీజన్ లో గోవా తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. జైస్వాల్ ఈ సీజన్ లో ముంబయి నుంచి గోవాకు మారనున్నట్లు గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అధ్యక్షుడు విపుల్ ఫడ్కే ధృవీకరించారు. జైస్వాల్ ఇప్పటికే ముంబ క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నుంచి నిరభ్యంతర ధృవపత్రం (ఎన్‌ఓసీ) కూడా అందుకున్నాడు. గతంలో సిద్ధేశ్ లాడ్, అర్జున్ టెండూల్కర్ ముంబయి నుంచి గోవాకు తరలి వెళ్లారు. వారు రంజీల్లో గోవాకు ప్రాతినిధ్యం వహించారు. ఈ విషయం గురించి గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విపుల్ ఫడ్కే మాట్లాడుతూ, "యశస్వి జైస్వాల్ ముంబయి క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌ఓసీ పొందాడు. మా కార్యదర్శి (శంభా నాయక్ దేశాయ్) అతనితో టచ్‌లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. తన వ్యక్తిగత కారణాల వల్ల జైస్వాల్ ముంబయిని విడిచిపెట్టాడు" అని వెల్లడించారు. అతను ముంబయి టీమ్ ని ఎందుకు విడిచిపెట్టాడనే దానిపై తనకు కచ్చితమైన అవగాహన లేదని ఫడ్కే పేర్కొన్నారు. జైస్వాల్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడు గోవా జట్టులో శుభ పరిణామం అని, అతనితో ఆడే అవకాశం గోవా ఆటగాళ్లకు లభిస్తుందని, తద్వారా భారత జట్టు స్థాయి ఆటగాడి నుంచి వారు నేర్చుకోగలరని ఫడ్కే వివరించారు.
![]() |
![]() |