ముంబయి 26 /11 దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించడంపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముష్కరుల బీభత్సాన్ని ప్రత్యక్షంగా చూసినవారు ఆ పీడకల తమ కళ్లముందు ఇంకా కదలాడుతోందని చెబుతున్నారు. ఇక, తమ ప్రాణాలకు పలువుర్ని కాపాడిన కొందరు ఆ సమయంలో తాము ఎదుర్కొన్న ఒత్తిడిని నెమరువేసుకుంటున్నారు. అలాంటివారిలో ముంబయి కామా ఆసుపత్రిలో పనిచేసే నర్సు అంజలి కుల్తే ఒకరు. తమ ఆసుపత్రిలోని 20 మంది గర్భిణీ స్త్రీలను ఉగ్రదాడి నుంచి రక్షించడమే కాదు... అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఓ గర్బిణికి సురక్షితమైన ప్రసవం జరిగేలా చూశారు.
తాజాగా అంజలి కుల్తే ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నవంబర్ 26న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్‌పై దాడి చేస్తున్న ఉగ్రవాదులు.. కామా ఆసుపత్రి వైపు కదులుతున్నారని తమకు సమాచారం అందిందని తెలిపారు. కొద్ది నిమిషాల తర్వాత ఆసుపత్రి వెనుక ఉన్న సందులో కాల్పుల శబ్దం విన్నామని చెప్పారు.
‘కిటికీలో నుంచి చూస్తే, ఇద్దరు ఉగ్రవాదులు పరిగెత్తుకుంటూ రావడం.. పోలీసులు వారిపై కాల్పులు జరపడం కనిపించింది.. తరువాత ఉగ్రవాదులు గేటు దూకి ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించారు.. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను వారు కాల్చి చంపడం నేను చూశాను.. కిటికీ వద్ద ఉన్న మమ్మల్ని గమనించి వారు మాపై కాల్పులు జరిపారు.. కాల్పుల్లో మా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. నేను ఆమెను ఎమర్జెన్సీ విభాగానికి తీసుకెళ్లి, ఉగ్రవాదులు ఆసుపత్రిలోకి ప్రవేశించారని అందరికీ చెప్పాను’ అని అంజలి వెల్లడించారు.
‘అక్కడ నుంచి ప్రసూతి వార్డుకు తిరిగొచ్చి మెయిన్ డోర్లు మూసివేసి, 20 మంది గర్బిణిలను ఓ చిన్న గదిలోకి తీసుకెళ్లాను.. సెల్‌ఫోన్‌లు, లైట్లు స్విచ్ ఆఫ్ చేసి.. వారు చీకటిలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. కొద్దిసేపటికే హైబీపీతో బాధపడుతున్న మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి... అప్పటికే ఆసుపత్రి లోపల కాల్పులు తీవ్రంగా జరుగుతుండటంతో ఆ వార్డుకు రావడానికి డాక్టర్ నిరాకరించారు... ఆమెను మెల్లగా గోడ పక్క నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రసూతి గదికి తీసుకెళ్లాను.. కొద్ది గంటల తర్వాత ఆమె ఒక ఆడ పిల్లను ప్రసవించింది.. ఆ శిశువుకు 'గోలీ' అని పేరు పెట్టారు.. ఆ రాత్రి ఐదు గంటల పాటు ఆసుపత్రిపై దాడి జరిగింది’ అని తెలిపారు.
ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు ఆసుపత్రి ఉద్యోగి కూడా చనిపోయారు. ఆ భయానక అనుభవం , బాధ నుంచి బయటపడ్డారా? అని అడిగిన ప్రశ్నకు కుల్తే మాట్లాడుతూ... ‘ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్లు, నర్సులు లేదా ఇతర సిబ్బంది ఏ ఒక్కరూ ఆ రాత్రిని ఎప్పటికీ మరచిపోలేరు.. వారు గ్రెనేడ్‌లు విసరడం, కాల్పులు జరిపిన తీరు.. ప్రజలను చంపిన విధానం, మాలో ఎవరూ ఎప్పటికీ మరచిపోలేరు. దేశం మొత్తానికి అది దుఃఖం.. భయానకమైన రాత్రి’ అని ఆమె అన్నారు.
నవంబరు 26, 2008 నాటి ఉగ్రదాడుల్లో తహవూర్ రాణా కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల పాటు పాకిస్థాన్ ఉగ్రమూకలు సాగించిన నరమేధంలో విదేశీయులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు పాకిస్థాన్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ తన వాంగ్మూలంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం రాణా లాజిస్టికల్, ఆర్థిక సహాయం అందించాడని వెల్లడించారు.
2008 నవంబరులో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోకి చొరబడిన పాకిస్థాన్ ముష్కరులు.. తాజ్ హోటల్, రైల్వే స్టేషన్, ఒక యూదు కేంద్రం, ఇతర ప్రదేశాలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పాల్గొన్న 10 మంది ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతడ్ని నవంబర్ 21, 2012న ఉరితీశారు. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడులకు పాల్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa