పశ్చిమ్ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలతో ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన హింసాత్మక ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కలకత్తా హైకోర్టు ఘాటుగా స్పందించింది. రాజ్యాంగ న్యాయస్థానాలు ప్రేక్షకపాత్ర పోషించలేవని నొక్కిచెప్పిన హైకోర్టు.. కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని, వారి ప్రాణాలను, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. ‘ప్రజల భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ న్యాయస్థానాలు మూగ ప్రేక్షకులుగా ఉండలేవు.. సాంకేతిక రక్షణలలో చిక్కుకోలేవు.. సమయానికి తగిన చర్యలు తీసుకోనందున కేంద్ర సాయుధ బలగాల ముందస్తు మోహరింపు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసి ఉండొచ్చు’ అని కోర్టు పేర్కొంది.
పరిస్థితి తీవ్రమైందని, అస్థిరమైందని... అమాయక పౌరులపై దారుణాలకు పాల్పడిన నిందితులపై యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాలని .న్యాయస్థానం ఆదేశించింది. ‘పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో విధ్వంసం జరిగినట్లు ప్రాథమిక నివేదికలను మేము విస్మరించలేం... పారామిలటరీ బలగాలు లేదా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించే ఉద్దేశం ఈ రాష్ట్రంలోని ప్రజల భద్రత, వారి భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేయడమే.. కొన్ని జిల్లాల్లో అంతర్గత అల్లర్లు ఉన్నాయనేది కాదనలేనిది’ అని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.
కేంద్ర బలగాలు, రాష్ట్ర పరిపాలన యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తాయని, పరిస్థితిపై వివరణాత్మక నివేదికలను సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముర్షిదాబాద్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ రాజా బసు చౌదరిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
ముర్షిదాబాద్ జిల్లాలోని హింసాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించడాన్ని గవర్నర్ సీవీ ఆనంద బోస్ శనివారం రాత్రి స్వాగతించారు. ‘‘ముర్షిదాబాద్ సహా బెంగాల్‌లోని అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాల మోహరింపు గురించి నాకు తెలియజేశారు. కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను,’ అని రాజ్‌భవన్ విడుదల చేసిన వీడియో సందేశంలో గవర్నర్ అన్నారు.
అంతకుముందు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) చట్టాన్ని తన రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించారు. అంతేకాదు, ఈ చట్టాన్ని కేంద్రం చేసిందని, దీనిపై వారినే సమాధానం అడగండి అని ఆందోళనకారులకు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపేక్షించబోమని, అల్లర్లను రెచ్చగొట్టేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. నిరసనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాలను రాష్ట్ర పోలీసులు సహించబోరని డీజీపీ రాజీవ్ కుమార్ ఆందోళనకారులను హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa