ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెగ్యులర్‌గా కొన్ని ఆసనాలు వేస్తే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 11:27 PM

డయాబెటిస్‌కు ఇంకా చికిత్స లేనప్పటికీ కొన్ని పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు. ఈ పద్ధతుల్లో యోగా కూడా ఉంది. యోగా శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.


డయాబెటిస్ ఉన్నవారు టెన్షన్ పడకండి, రెగ్యులర్‌గా కొన్ని ఆసనాలు వేస్తే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి


ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది అతి పెద్ద ముప్పుగా మారింది. డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులకు గురవుతాయి. దీంతో శరీర కణాలకు శక్తి అందక అలసటగా అనిపిస్తుంది. డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే, జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. అయితే జీవన శైలి మార్పులు, చిన్నపాటి ఆహారపు అలవాట్లు పాటిస్తే వ్యాధి సోకే ముప్పు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.


డయాబెటిస్‌కు ఇంకా చికిత్స లేనప్పటికీ కొన్ని పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు. ఈ పద్ధతుల్లో యోగా కూడా ఉంది. యోగా శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. ఇది క్రమంగా శరీరాన్ని బలపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ అంశాలన్నీ మధుమేహాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ కొన్ని యోగా భంగిమలు చేయడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. ఆ యోగాసనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


యోగాసనాలు మధుమేహాన్ని ఎలా నియంత్రిస్తాయి?


యోగాసనాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. దీనితో పాటు, యోగా మధుమేహానికి ప్రధాన ట్రిగ్గర్ అయిన ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది. డయాబెటిస్‌ని నియంత్రణలో ఉంచడానికి ఐదు ప్రభావవంతమైన యోగాసనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


త్రికోణాసనం


త్రికోణాసన లేదా త్రిభుజాకార భంగిమ శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి మంచి యోగా ఆసనం. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ ఆసనం కోసం కాళ్ళను తుంటి దూరంలో చాచి నిలబడి.. కుడి కాలును 90 డిగ్రీల వద్ద వంచి.. ఎడమ కాలును నిటారుగా ఉంచండి. కుడి చేతిని నేలపైకి ఆనించి, ఎడమ చేతిని పైకి లేపండి. ఈ ఆసనం రెగ్యులర్‌గా వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.


భుజంగాసనం


ఈ ఆసనం వల్ల ఉదర అవయవాలు బలపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకొని శరీరం మొత్తాన్ని పూర్తిగా సాగదీయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆని ఉండేలా చూసుకోవాలి.


కొద్దిసేపయ్యాక శ్వాసను వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి. ఈ దశలో ఛాతీకి దగ్గరగా అరచేతులను నేలకు ఆనించాలి. బలాన్ని చేతులపై మోపుతూ.. శ్వాసను తీసుకుంటూ తల, ఛాతీ, కడుపు భాగాన్ని పైకి లేపాలి. కొద్దిసేపు అలాగే ఉండి శ్వాసను వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి. రెగ్యులర్‌గా ఈ ఆసనం వేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.


వృక్షాసనం


ఈ ఆసనం సమతుల్యతను, దృష్టిని మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఇందుకోసం నిటారుగా నిల్చుని చేతులు శరీరానికి ఇరువైపులా కిందకు వేలాడేలా ఉంచి.. నెమ్మదిగా మీ మోకాలిని వంచి.. మరొక తొడపై పాదాన్ని ఉంచడానికి ప్రయత్నించండి. మరో కాలు నిటారుగా ఉండేలా చూడాలి. కాళ్లను బ్యాలెన్స్ చేసి లోతైన శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని నెమ్మదిగా పైకి లేపాలి.


చేతుల్ని నమస్కారం పెడుతున్నట్టు పట్టుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు నేరుగా చూడండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండండి. తర్వాత కాలిని కిందకు దించి చేతుల్ని రెండు పక్కలా ఉంచేలా కిందకు దించాలి. తర్వాత మరో కాలుతో ఇదే పద్ధతిని రిపీట్ చేయాలి. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.


శవాసనం


శవాసనం వల్ల శరీరంలోని అవయవాలు విశ్రాంతి పొందుతాయి. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. దీని కోసం యోగా మ్యాట్‌ మీద వెల్లకిలా పడుకోవాలి. కాలి మడమలు లోపలికీ, కాలి వేళ్లు బయటకూ ఉండేలా రెండు కాళ్లను అడుగు.. అడుగున్నర దూరంలో ఉంచాలి. చేతులను శరీరం పక్కన ఉంచాలి. అర చేతులు ఆకాశం వైపు ఉండేలా పెట్టి చేతి వేళ్లను కొంచెం ముడిచి ఉంచాలి.


కళ్లు మూసుకుని తలను స్థిరంగా ఉంచాలి. శరీరంలోని ప్రతి అవయవాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచాలి. శరీరం చాలా తేలికగా మారటం, శ్వాస క్రియ వేగం తగ్గడం గమనించాలి. ఈ ఆసన స్థితి నుంచి బయటకు వచ్చేటపుడు కాళ్లు, చేతులను కదిలించి తలను కుడి, ఎడమ వైపులకు తిప్పాలి. ఆ తరువాత పడుకున్న స్థితిలో కుడి వైపు తిరిగి ఎడమ చేతిని ఛాతీ దగ్గరగా నేలపై ఉంచి పైకి లేచి సుఖాసనంలో కూర్చోవాలి. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుతుంది.


పాదాహస్తాసనం


పాదహస్తాసనం, స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ భంగిమ జీర్ణ అవయవాలను మసాజ్ చేస్తుంది. అపానవాయువు, మలబద్ధకం, అజీర్ణాన్ని తగ్గిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ముక్కు, గొంతు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. దీన్ని చేయడానికి ముందుగా నిటారుగా నిలబడండి. ఆ తర్వాత మెల్లగా చేతులను పైకి లేపి.. గాలిని నెమ్మదిగా వదిలేస్తూ నడుమును వంచుతూ రెండు చేతులతో రెండు కాళ్ల మునివేళ్లను తాకాలి. అలా 10-30 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత సాధారణ స్థితికి రావాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa