జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ-సీసీఎస్ సమావేశమై 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారత్‌లోని పాక్ వాసుల వీసాలు రద్దు చేసి.. వారిని వెనక్కి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ పౌరుల వివరాలు సేకరించి.. కేంద్ర ప్రభుత్వానికి అందించాలని కేంద్రమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇటీవల సూచించారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ పౌరులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వాలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్తాన్ వాసులు ఉన్నారని.. ఇందులో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాల మీద వచ్చినట్లు మహారాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న పౌక్ దేశస్థులు ఈనెల 27వ తేదీ(ఆదివారం) లోపు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో రెండు రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈనెల 29వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే భారత్, పాక్ సరిహద్దుల్లో ఉన్న అట్టారీ బోర్డర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 5 వేల మంది పాకిస్తాన్ పౌరులు.. దేశం విడిచి వెళ్లాలని సూచించినట్లు మంత్రి యోగేష్ కదమ్ స్పష్టం చేశారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో దీర్ఘకాలిక వీసాలపై దాదాపు 4 వేల మంది పాకిస్థానీయులు ఉండగా.. సార్క్ వీసా కింద మరో 1000 మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ వెయ్యి మందిలో సినిమా ఇండస్ట్రీ, మెడికల్, జర్నలిజం, వ్యక్తిగత పనుల కోసం మహారాష్ట్రకు వచ్చిన వారు ఉన్నారని మంత్రి వెల్లడించారు. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వీరిలో కొందరు గత 8 నుంచి 10 ఏళ్లుగా మన దేశంలోనే ఉంటున్నారని మంత్రి యోగేష్ తెలిపారు. అంతేకాకుండా కొందరు పాకిస్తాన్ పౌరులు.. స్థానికంగా వివాహాలు చేసుకోగా.. మరికొందరు తమ పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా.. షార్ట్ టెర్మ్ వీసాలపై భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ వాసులు ఆదివారం లోగా తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లిపోవాలని మంత్రి యోగేష్ కదమ్ తేల్చి చెప్పారు. అయితే మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన వారికి మాత్రం మానవతా దృక్పథంతో అదనంగా మరో 2 రోజులు మాత్రమే సమయం ఇస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa