కృష్ణా జిల్లా రాజకీయాల్లో సామినేని ఉదయభానుది ఓ ప్రత్యేక ఒరవడి. జిల్లాలో సీనియర్ నేతగా వెలుగిందుతున్న ఆయన 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి జగ్గయ్యపేట బరిలో వరుసగా గెలిచారు. ఆ తర్వాత 2009 లో కాంగ్రెస్ నుండి, 2014లో వైసీపీ నుండి టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్ చేతిలోనే ఓడిపోయారు.
ఈ సారి ఎన్నికల్లో టీడీపీ తరపున తిరిగి శ్రీరామ్ తాతయ్యే పోటీలో నిలబడుతుండగా…వైసీపీ నుండి సామినేని కే టిక్కెట్ దక్కనుండటంతో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారాయన. శ్రీరామ్ చేతిలో. రెండు సార్లు ఓడిపోయిన సామినేని ఈసారైనా సానుబూతితో జగ్గయ్యపేటని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.
తను ఓడినా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్న నేతగా పేరున్న సామినేని , ప్రజాసమస్యలపై స్పందించడంలో ముందుండి ప్రభుత్వంతో ఓ తరహా యుద్ధమే చేస్తూ వచ్చారు. దీంతో సామినేనికి కూడా నియోజకవర్గంపై మంచి పట్టు దక్కిందన్నది వైసిపి వర్గాల వాదన కాగా, తను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను మళ్ళీ గెలిపించి అసెంబ్లీ కి పంపుతుందన్న ధీమా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ది. అయితే నియోజకవర్గంలోపలు చోట్ల తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటం, వేసవిలో ఎన్నికల నాటికి ఇది మరింత తీవ్రమైతే ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకిత పెరిగి తనకు కలసి వస్తుందని ఉదయభాను భావిస్తున్నారు.
అయితే ఉదయభాను కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేన కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వాలని భావిస్తోంది. జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా అటు కాపు ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే టిడిపి, వైసిపి జగ్గయ్యపేటలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏప్రియల్ 11 నాటికి ఇవి మరింత ఉధృతం కానున్నాయి. దీంతో సామినేని గెలుపుకు బాటలు వేసుకుంటారో, శ్రీరామ్ హ్యాట్రిక్ కొట్టేదిశలో ఫలితం అందుకుంటారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa