ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు అధికారిపైకి చెయ్యెత్తిన కర్ణాటక సీఎం

national |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 09:30 PM

ఏప్రిల్ 22వ తేదీ జమ్ము కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తుండగా.. తాజాగా ఆయన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈక్రమంలోనే సీఎంను చూసిన బీజేపీ నాయకులు.. గో టు పాకిస్థాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం అక్కడే ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్‌ను స్టేజీ మీదకు పిలిచారు. అంతా చూస్తుండగానే.. ఆయన చెంప పగులగొట్టేందుకు చెయ్యి లేపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. మైసూర్‌లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో యుద్ధానికి భారత్ తొందర పడకూడదని, భద్రతా చర్యలను పటిష్టం చేయడంపై దృష్టి సారించాలని చెప్పుకొచ్చారు. తామెప్పుడూ యుద్ధానికి అనుకూలం కాదని.. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని వివరించారు. ప్రజలు సురక్షితంగా ఉన్నామని భావించేలా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అంటూ పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్య చేసిన ఈ కామెంట్లతో దేశ వ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని, సిద్ధరామయ్య పాకిస్థాన్ రత్న అంటూ విమర్శించారు.


మరోవైపు ఈయన చేసిన కామెంట్లను పాకిస్థాన్ మీడియా సైతం ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. యుద్ధంపై ఆ దేశంలోనే వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయంటూ రాసుకొచ్చారు. దీంతో తన తప్పు గుర్తించిన సీఎం తాను వెంటనే యుద్ధం వద్దని మాత్రమే చెప్పానని.. పూర్తిగా ఆపమని అనలేదని చెప్పుకొచ్చారు. కానీ ఈయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం ప్రజలు, విపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అయితే సిద్ధరామయ్య కామెంట్ల గురించి ప్రస్తావిస్తూ.. ఆయన పాకిస్థాన్ వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. మనకు జరిగిన అన్యాయానికి ఏ ఒక్క భారతీయుడు కూడా ఇలా మాట్లాడలేరంటూ చెప్పుకొస్తున్నారు.


ఇదిలా ఉండగా.. నేడు బెళగావిలో ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి మరీ అక్కడకు చేరుకున్నారు. సిద్ధరామయ్య డౌన్ డౌన్ అంటూనే.. ఈయన పాకిస్థాన్ వెళ్లిపోవాంటూ సూచించారు. ఇలా ఆయన మాట్లాడేందుకు మైకు తీసుకున్న ప్రతీసారి బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయగా.. తీవ్ర అసహానికి గురైన సీఎం.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచారు. ముఖ్యంగా ఏక వచనంతో సంబోధిస్తూ.. ఎయ్ అక్కడెవరు, ఇటు రా అంటూ వ్యాఖ్యానించారు. ఈక్రమంలోనే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  నారాయణ భరమణి స్టేజీ మీదకు వచ్చారు.


ఆయన రావడంతోనే.. సీఎం సిద్ధరామయ్య ఆయన చెంప పగులగొట్టేందుకు చెయ్యి పైకెత్తారు. కానీ కొట్టకుండా అలాగే ఆగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ప్రజలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారితో ఇలాగేనా ప్రవర్తించేంది అంటూ విమర్శిస్తున్నారు. మీ పదవీ కాలం కేవలం 5 సంవత్సరాలేనని, కానీ పోలీసులు 60 ఏళ్ల పాటు రాష్ట్రం, దేశం కోసం సేవ చేస్తారని చెప్పుకొస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదంటూనే.. ఇకనైనా మీ పద్దతి మార్చుకోమంటూ కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa