డిజిటల్ రంగంలో తమిళనాడు ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ముందడుగు వేసింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందిరకీ నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఓ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. నెలకు 200 రూపాయలు మాత్రమే చెల్లిస్తే.. 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరికల్లానే ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సాంకేతిక, సమాచార పరిజ్ఞానం మరియు డిజిటల్ సేవల మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ వెల్లడించారు.
తన శాఖకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లపై సభలో జరిగిన చర్చకు సమాధానంగా.. తమిళనాడు రాష్ట్ర సాంకేతిక, సమాచార పరిజ్ఞానం మరియు డిజిటల్ సేవల మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ ప్రజలందరికి శుభవార్త చెప్పారు. నెలకు రూ.200 అత్యంత సరసమైన ధరలతో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే ప్రణాళికలను వెల్లడించారు. తమిళనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టు.. 57,500 కిలో మీటర్ల ఆప్టికల్ ఫైబర్ వేయడం ద్వారా 12,525 గ్రామాలను 1 జీబీపీఎస్ బ్యాండ్ విడ్త్‌తో అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
గత ఏఐడీఎంకే పాలనలో ఈ ప్రాజెక్టు విషయంలో జాప్యం జరిగినప్పటికీ.. ప్రస్తుత పరిపాలనలో ఈ ప్రాజెక్టు ఊపందుకుందని మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ వివరించారు. ఇప్పటికే 93 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మొత్తంగా 11,639 గ్రామ పంచాయతీలు ఇప్పటికే దీని ద్వారా అనుసంధానించబడ్డాయని ధ్రువీకరించారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయి.. సేవలను అందుబుటాలోకి తీసుకు వస్తామన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ కెనక్టివిటీ గణనీయంగా మెరుగు పడుతుందని చెప్పుకొచ్చారు.
విద్యా ప్రయోజనాలతో పాటు అందరికీ సమాన స్థాయిలో జ్ఞానం అందించాలంటే ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చాలా అవసర పడుతుందని మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ వివరించారు. అంతేకాకుండా చివరి మైలు కనెక్టివిటీ కోసం 4,700 పంచాయతీలు దరఖాస్తు చేసుకున్నాయని.. గృహాలకు 100 ఎంబీపీఎస్ కనెక్షన్లను తీసుకు రావడానికి కేబుల్ టీవీ ఆపరేటర్ల మాదిరిగానే ఫ్రాంచైజీ మోడల్‌ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. గతంలో సమస్యలతో సతమతమైన టీఏసీటీవీ సేవ రాబోయే మూడు నెలల్లో HD సెట్-టాప్ బాక్సుల విడుదలతో సహా మెరుగు పడుతుందని హామీ ఇచ్చారు. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa