చుట్టూ ఎగిసిపడుతున్న అగ్నికీలాలు, కమ్ముకున్న దట్టమైన పొగ, ఉన్నదేమో ఆరవ అంతస్తు.. తప్పించుకునే దారి లేని నిస్సహాయ స్థితిలో ఆ మహిళ నరకం చూసింది. కానీ ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలనుకోంది. అందుకోసం ఏవైనా మార్గాలు ఉన్నాయా అని వెతకగా.. 6వ అంతస్తు నుంచి కిందకు దూకితేనే.. ప్రాణాలు దక్కుతాయి. లేదంటే ఆ మంటల్లో ఊపిరాడక అగ్నికి ఆహుతై చావాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ధైర్యం చేసి ఆ మహిళ చేసిన చర్య ఇప్పుడు అందరి మన్ననలను అందుకుంటోంది. మరి ఆమె ఏం చేసిందంటే..?
అహ్మదాబాద్‌లోని ఇందిరా బ్రిడ్జి సమీపంలోని ఒక నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎత్తైన నివాస సముదాయంలో చెలరేగిన మంటలు, దట్టంగా అలుముకున్న పొగ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నాయి.
ఒకవైపు మంటలు ఆర్పేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతూనే మరోవైపు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో పడ్డాయి రెస్క్యూ బృందాలు. ఆరో అంతస్తులో అగ్ని ప్రమమాదం సంభవించడంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బంది తలెత్తింది. అయినా పట్టు వదలకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ లోపు భవనం పైన ఉన్న వారిని కిందకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. భారీ వలలు, ఇంట్లోని పరుపులు, తాళ్లతో బాధితులను రక్షించే ప్రయత్నాలు చేశారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కూడా తోడవ్వడంతో సహాయక చర్యలు నిరాటంకంగా సాగాయి.
అదే అంతస్తులో మరోవైపు ఉన్న ఇంట్లో ఉన్న మహిళ ఊపిరాడక బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. కానీ మెట్ల వైపు వెళ్లే అవకాశం లేకపోవడంతో కిటికీ నుంచి బయటకు వచ్చి నిలబడింది. ఇంట్లో నుంచి వస్తున్న భారీ పొగ, మంటల వేడికి తాళలేక అవస్థ పడింది. ఇంట్లోకి వెళ్తే ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. ఇక చేయాల్సిందల్లా 6వ అంతస్తులో ఉన్న ఆ కిటికీ నుంచి దూకేయడమే. ఈలోపు రెస్క్యూ బృందాలు, స్థానికులు కింద పరుపులు, వలలు ఏర్పాటు చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడింది. స్వల్ప గాయాలు అయ్యాయి. పొగ పీల్చుకుని ఊపిరాడక ఇబ్బంది పడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల్లోనే మంటలను అదుపు చేశారు. 4వ అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో ఉన్న ఏసీలోంచి మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త 5వ అంతస్తుకు, 6వ అంతస్తుకు వ్యాపించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa