ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లివర్ చుట్టూ కొవ్వు చేరితే,,,, నిర్లక్ష్యం చేస్తే మీకే డేంజర్

Health beauty |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 11:42 PM

కాలేయం మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది. కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి. కొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో.. అనేక వ్యాధుల బారిన మనం పడవచ్చు.


ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్‌ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది. అయితే, మన కాలేయం దెబ్బ తిన్నా, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో పదే పదే కొన్ని లక్షణాలు కనిపిస్తే మహిళలు జాగ్రత్తగా ఉండాలి. మహిళలు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతుంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ చుద్దాం.


ఫ్యాటీ లివర్ అంటే ఏంటి?


​కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు, దాని పనితీరు స్పష్టంగా ప్రభావితమవుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి. రెండోది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి. అధికంగా ఆల్కహాల్ తీసుకునేవారిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తుంది. అయితే ఆల్కహాల్ తీసుకోని వారు లేదా చాలా పరిమిత పరిమాణంలో తీసుకునే వారిలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కనిపిస్తుంది. ఇక, మహిళల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా PCOS ఉన్న స్త్రీలకు ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా థైరాయిడ్ లేదా టైప్ 2 డయాబెటిస్ ఉంటే, మహిళల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.


అలసట


చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? గత కొన్ని రోజుల నుంచి అలసటతో బాధపడుతున్నారా అయితే, ఈ లక్షణాలు కూడా లివర్ ప్రమాదంలో పడిందని సూచించేవే. మీరు ఏ పని చేయకపోయినా అలసిపోయినట్టు భావిస్తే అది ఫ్యాటీ లివర్‌కి సంకేతం కావచ్చు. అంతేకాకుండా మహిళల చేతి గోళ్లు లేదా కాళ్ల గోళ్లు కూడా రంగు మారుతాయి. గోళ్ల మీద తెలుపు రంగు మ‌చ్చ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. లేదా గోళ్లు ప‌సుపు రంగులో కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఒంటి నొప్పులు, నడిచేటప్పుడు అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.


వికారం


మహిళలు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్టుయితే ఆకలి మందగిస్తుంది. చాలా రోజుల వరకు ఏమి తినాలనిపించదు. అంతేకాకుండా వికార సమస్యలు ఉంటాయి. తరుచుగా వాంతులు అవుతుంటాయి. భోజనం చేసిన వెంటనే వికారం, వాంతులవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం బెస్ట్.


చర్మం రంగు మార్పు


కళ్లు, చర్మం పచ్చ రంగులో మారడం పచ్చ కామెర్లు లక్షణాలు. ఈ సంకేతాలు పదే పదే మీకు కనిపిస్తే మీకు ఫ్యాటీ లివర్ ఉందని అర్థం చేసుకోండి. పచ్చ కామెర్లు రావడం కాలేయ సమస్యల్ని సూచిస్తుంది. పచ్చ కామెర్లు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడే అవకాసం ఉంది.


కాళ్ల వాపులు


​కాలేయ పనితీరు మెరుగ్గా లేనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి. దీంతో.. చాలా అవయవాల్లో నీరు ఎక్కువగా చేరుతుంది. దీంతో.. శరీరంలోని కొన్ని భాగాలు వాపులకు లోనవుతుంటాయి. ముఖ్యంగా కాళ్లు, పాదాల్లో వాపులు కనిపిస్తాయి. చేతి వేళ్లతో నొక్కితే చర్మం లోపలికి పోతుంది. ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. ఫ్యాటీ లివర్‌ని సూచించే సంకేతం ఇది. అందుకే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి.


మూత్రం రంగులో మార్పు


మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే ఏ సమస్య ఉండదు. చాలా మందికి అప్పుడప్పుడు మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంటుంది. ఒంటిలో వేడి చేసినప్పుడు ఇలా కనిపిస్తుంటుంది. అయితే, మూత్రం తరుచుగా పసుపు రంగులో కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు మూత్రం రంగు ఇలా కనిపిస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరుచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు.


కడుపులో భరించలేని నొప్పి


ఫ్యాటీ లివర్ ఉంటే కడుపు దిగువ భాగంలో భరించలేని నొప్పి ఉంటుంది. ఈ నొప్పిని మహిళలు తట్టుకోలేరు. ఏ కారణం లేకుండా పదే పదే ఈ నొప్పి వస్తుంటే అలర్ట్ అవ్వండి. వెంటనే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు చేతులు లేదా కాళ్ల సిరలు గట్టి పడటం, చర్మంపై దురద వంటి లక్షణాలు కూడా ఫ్యాటీ లివర్ ఉంటే కనిపిస్తాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa