జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో గత నెల 22న జరిగిన భయానక ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు భారతదేశం ప్రతీకారం తీర్చుకునే వరకు బొకేలు లేదా జ్ఞాపికలు తీసుకోనని కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటీల్ శపథం చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పాటీల్.. అక్కడ తనకు అందించిన బొకేలు, జ్ఞాపికలను సున్నితంగా తిరస్కరించారు. దీనిపై కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరు మాట్లాడుతూ.. ‘‘పహల్గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకునే వరకు స్వాగతం పలికే సమయంలో ఇచ్చే బొకేలు, జ్ఞాపికలు తీసుకోకూడదని మంత్రి నిర్ణయించుకున్నారు’ అని తెలిపారు. దీంతో అక్కడ వారి నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ‘ప్రతీకారం తీర్చుకునేవరకు బొకేలు తీసుకోను’ అని పాటీల్ గుజరాతీలో వ్యాఖ్యానించారు.
పాకిస్తాస్థాపై చర్యల భాగంగా సింధూ నదీ జలాల ఒప్పందం రద్దుపై పాటీల్.. ‘ఇకపై ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు వెళ్లనివ్వం’ అన్నారు. ‘సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం న్యాయసమ్మతమే కాదు, జాతీయ ప్రయోజనాల కోసం కూడా అత్యంత అవసరం... సింధూ నదిలోని నుంచి ఒక్క బొట్టు నీరు కూడా పాకిస్థాన్‌కి వెళ్లకుండా నిరోధిస్తాం’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 25 మంది పర్యాటకులు సహా 26 మంది మృతి చెందారు. ఈ దాడి తర్వాత భారత్ పాక్‌పై అనేక చర్యలు తీసుకుంది. వాటిలో ముఖ్యమైనవి: అటారి-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేయడం, పాకిస్థానీ పౌరుల వీసాలు రద్దు చేయడం, దేశవ్యాప్తంగా పాకిస్తాన్ హైకమిషన్‌ల ఉద్యోగుల సంఖ్యను కుదించడం.
సూరత్ పెట్టుబడుల సదస్సులో భారతదేశ భవిష్యత్ అభివృద్ధిపై పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, వినూత్నత తదితర అంశాలపై గణనీయమైన చర్చలు జరిగాయని కేంద్ర మంత్రి పాటిల్ తెలిపారు. అలాగే, ‘నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారత్ అనే దిశగా దేశం వేగంగా దూసుకుపోతోంది.. ఈరోజు భారత్ కేవలం వినియోగదారునిగా కాకుండా, పెట్టుబడుల రంగంలో ప్రపంచ నేతగా ఎదుగుతోంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ నుంచి నేరుగా లేదా పరోక్షంగా చేసుకునే వస్తువుల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. అలాగే, పాకిస్తాన్ నుంచి అన్ని రకాల మెయిల్, పార్సిల్ పంపడం (గాలిమార్గం, భూమార్గం ద్వారా) నిలిపివేసింది. పాక్ జెండాలతో నడుస్తున్న నౌకలకు భారత పోర్టుల ప్రవేశాన్ని నిషేధించడమే కాక, భారత జెండాతో నడిచే నౌకలు పాకిస్థాన్ పోర్టులకు వెళ్లడాన్ని కూడా పూర్ణంగా నిషేధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa