యస్.. భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రతి ఒక్క భారతీయుడి పగ చల్లారింది. ఒక్క చోట కాదు.. రెండు చోట్ల కాదు.. ఏక కాలంలో 9 చోట్ల పాకిస్థాన్‌లో, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. అర్ధరాత్రి మెరుపు దాడులు చేసి.. శత్రువు అప్రమత్తం అయ్యేలోపే పని ముగించేసింది. ఈ దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారనే విషయమై ఓ స్పష్టత రానప్పటికీ.. 80 మందికిపైగా ఉగ్రమూకలు ఖతమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఈ దాడి తర్వాత సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ కవ్వింపులు మొదలయ్యాయి. భారత్ పరిమితంగా, వ్యూహాత్మకంగా చేపట్టిన సైనిక చర్యతో బిత్తరపోయిన పాక్ సైన్యం.. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ సామాన్య ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది.
పహల్గామ్ దాడి తర్వాత ఏ క్షణమైనా భారత్ తమపై దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్‌కు తెలుసు. ఇదే విషయాన్ని పాక్ నేతలు పదే పదే ప్రకటించారు కూడా. ఫలానా రోజున దాడి జరగొచ్చంటూ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. పాక్ ఎంత అప్రమత్తంగా ఉన్నా.. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించినా.. పాక్ ఏ మాత్రం ఊహించని రీతిలో భారత సైన్యం ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది.
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు భారత్ చాలా తెలివిగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపడుతున్నామంటూ.. శత్రువుపై ఏమార్చింది. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ కొద్ది గంటల ముందు.. రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటో చూద్దాం..
ఐక్యరాజ్య సమితిలో భారత్‌ను దెబ్బకొట్టాలనుకున్న పాకిస్థాన్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. భద్రతా మండలి భేటీలో లేనిపోని ఆరోపణలు చేసి.. భారత్‌ను ఇరుకున పెట్టాలని పాకిస్థాన్ భావించింది. కానీ ఆ దేశం ఊహించని రీతిలో ఐరాస భద్రతా మండలి నుంచి చివాట్లు తినాల్సి వచ్చింది. పహల్గాం దాడిలో లష్కరే తోయిబా ప్రమేయం గురించి ప్రశ్నించిన భద్రతా మండలి.. ఆ ఉగ్రవాద సంస్థ మీ భూభాగం నుంచి కార్యకలాపాలు చేపట్టడం లేదా..? అని ప్రశ్నించింది. అణు దాడుల గురించి, క్షిపణులతో దాడుల గురించి మీరెందుకు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని తలంటింది. ఈ సమయంలో చైనా సహా ఏ ఒక్క దేశమూ పాకిస్థాన్‌కు అండగా నిలవలేదు. దీంతో దాయాది ఒంటరి అయ్యింది.
అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు ఎలాంటి మద్దతు లేదని ఈ ఘటన నిరూపించింది. పరిమిత స్థాయిలో సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయంగా తమకు ఎలాంటి నష్టం ఉండదని, ఎలాంటి ఆంక్షలు ఉండవనే అంచనాకు భారత్ వచ్చింది. అందుకే ఉగ్రవాద కేంద్రాలపైనే దాడి చేశామని ఇండియా చెబుతోంది. వ్యూహాత్మకంగానే యుద్ధం ప్రస్తావన తీసుకురావడం లేదు. ఉగ్రవాదం నుంచి తనను తాను కాపాడుకోవడానికి చేపట్టిన చర్యగా భారత్ దీన్ని చెప్పుకుంటుంది. కాబట్టి భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేవు.
ఆపరేషన్ సిందూర్‌కు కొద్ది గంటల ముందు భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అంటే యూకే విషయంలో భారత్ ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించింది. అమెరికాతో అత్యంత సన్నిహితంగా మెలిగే యూకే.. భారత్ చర్యలను సానుభూతి కోణంలో చూసేలా ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారత్ లాంటి పెద్ద మార్కెట్ ఉన్న దేశంతో ఒప్పందం చేసుకునే సమయంలో.. ఆ దేశానికి వ్యతిరేకంగా ఉండాలని ఏ దేశమూ భావించదు. యూకేతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం వల్ల.. ప్రాంతీయ ఉద్రిక్తతలు తమ ఆర్థిక పురోగతిని అడ్డుకోలేవని కూడా పరోక్షంగా స్పష్టం చేసినట్లయ్యింది. అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినా తమపై ఎలాంటి ప్రభావం ఉండదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత.. ప్రాంతీయ ఉద్రిక్తతలు తమ ఆర్థిక పురోగతిని ఆపలేవనే సందేశం ఇస్తూ.. భారత్ మెరుపు దాడులు చేసింది. అదే సమయంలో భారత్ మాక్‌డ్రిల్స్ ప్రకటనతో పాకిస్థాన్ కాస్త రిలాక్స్ అయ్యింది. ఇదే అదనుగా భారత్ దాడులు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa