అప్పుడే పుట్టిన పిల్లలను చూస్తుంటే భలే ముద్దుగా ఉంటుంది. వాళ్ల ప్రతి కదలిక మనకి సంతోషాన్నిస్తుంది. కాస్తంత నవ్వినా సరే తెగ ఆనంద పడిపోతాం. కాస్తంత హుషారుగా ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించినా, ఏ శబ్దం చేసినా సంబరపడిపోతాం. అయితే మనం కేవలం ఈ క్యూట్ నెస్ ని మాత్రమే చూస్తాం. కానీ పిల్లల్లో అంతకు మించి ఆసక్తికరమైన విషయాలుంటాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ జాగ్రత్తగా గమనిస్తే అవన్నీ మనకి అర్థమవుతాయి. వాళ్ల పుట్టగానే ఏడ్వడం నుంచి నవ్వు వరకూ ప్రతిదీ స్పెషలే. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఆసక్తికరమైన నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడ్చినా కన్నీళ్లు రావు
పిల్లలు పుట్టగానే ఏడవడం మొదలు పెడతారు. ఇక అప్పటి నుంచి వాళ్లకి అదే కమ్యూనికేషన్ లా ఉంటుంది. కొంత మంది పిల్లలు రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు. ఇంకొందరు రోజంతా ఏడుస్తారు. నిజానికి పిల్లలకు ఏడుపే బలం అంటారు పెద్ద వాళ్లు. ఇదంతా సరే. కానీ ఎప్పుడైనా పసి పిల్లలు ఏడుస్తుంటే ఒకటి గమనించారా. ఒక్క చుక్క కూడా కన్నీళ్లు రావు. కన్నీళ్లు రాకుండానే ఏడుస్తారు. దీనికి కారణమేంటో తెలుసా. అప్పుడే పుట్టిన పిల్లలకు ఇంకా కన్నీళ్లు డెవలప్ అవవు. సాధారణంగా కళ్లలో టియర్ డక్ట్స్ ఫామ్ ఉంటాయి.
ఇవి మనం ఏడ్చినప్పుడు కన్నీళ్లను రప్పిస్తాయి. చిన్న పిల్లల్లో ఇవి అప్పుడే ఏర్పడవు. వాళ్లు పూర్తిగా చూడగలిగి, అందరినీ గుర్తు పట్టగలిగేంత చూపు వచ్చినప్పుడు మాత్రమే ఇవి ఫామ్ అవుతాయి. కొన్ని వారాలు దాటాక కానీ ఇదంతా జరగదు. అందుకే పుట్టగానే వాళ్లు ఎంత గట్టిగా ఏడ్చినా ఒక్క కన్నీటి చుక్క కూడా బయటకు రాదు.
300 ఎముకలు
పసి పిల్లలు చూడడానికి మన చేయి అంత ఉంటారు. కానీ అంత చిన్న శరీరంలో దాదాపు 300 ఎముకలు ఉంటాయంటే మీరు నమ్మగలరా. అవును. పెద్ద వాళ్లలో 206 ఎముకలు ఉంటే..పిల్లల్లో మాత్రం ఇవి 300 వరకూ ఉంటాయి. మరి అదనంగా ఉండే ఈ ఎముకలు ఎక్కడ ఉంటాయనేగా మీ ప్రశ్న. ఈ ఎముకలన్నీ కార్టిలేజ్ తో ఏర్పడతాయి. పిల్లలు పెరిగే కొద్దీ ఇవి కరిగిపోతుంటాయి. పిల్లలు పుట్టినప్పుడు పుర్రెలో ఉండే ఎముకలు వేరువేరుగా ఉంటాయి. డెలివరీ సమయంలో వాళ్లు గర్భం నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఈ ఏర్పాటు ఉంటుంది. అయితే..వాళ్లు పుట్టిన తరవాత కొద్ది రోజులకు ఈ ఎముకలన్నీ కలిసిపోతాయి. పెద్ద వాళ్లకు ఉన్నట్టుగా వాళ్ల స్కల్ స్ట్రక్చర్ మారిపోతుంది.
10 వేల టేస్ట్ బడ్స్
ఈ విషయం చెప్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. పసి పిల్లల్లో దాదాపు 10 వేల టేస్ట్ బడ్స్ ఉంటాయట. అవును. పెద్ద వాళ్లలో ఈ టేస్ట్ బడ్స్ 2 వేల నుంచి 10 వేల లోపు ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన చిన్నారుల్లో మాత్రం ఇవి పది వేలు ఉంటాయి. అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..ఈ టేస్ట్ బడ్స్ కేవలం నాలుకపైనే కాకుండా వాళ్ల బుగ్గలు, నోరు, గొంతులో ఉంటాయి. తీపి, చేదు, వగరు ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్ వాళ్లకి తెలుస్తాయి. అలాంటివి నాలుకకు తగిలినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతారు. అయితే తీపికి మాత్రమే ఎక్కువగా స్పందిస్తారు. పెరిగే కొద్దీ టేస్ట్ బడ్స్ తగ్గిపోతూ ఉంటాయి. వాళ్లు కూడా పెద్ద వాళ్లలాగే అన్ని రుచులనూ ఆస్వాదిస్తారు.
ఒక్కోసారి శ్వాస ఆగిపోతుంది
చిన్నారుల్లో ఒక్కోసారి శ్వాస ఆగిపోతుందని మీకు తెలుసా. నిజమే. దీన్నే పీరియాడిక్ బ్రీతింగ్ అంటారు. కొన్ని సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం ఆపేస్తారు. ఆ తరవాత మళ్లీ నార్మల్ అయిపోతారు. రెస్పిరేటరీ సిస్టమ్ అప్పుడప్పుడే వాళ్లకి అర్థమవుతూ ఉంటుంది. ఎలా శ్వాస తీసుకోవాలో తెలుస్తుంది. ఈ ప్రాసెస్ లో ఇలా మధ్యలో శ్వాస కొన్ని క్షణాల పాటు ఆగిపోతుంది. వీటి వల్ల వాళ్లకి ఎలాంటి అపాయం ఉండదు. నిద్రలో ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటుంది. అయితే..ఈ గ్యాప్ మరీ ఎక్కువగా ఉందంటే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
తల కుడివైపునే
పిల్లలను నిద్రపోయినప్పుడు ఎక్కువ భాగం తలను కుడి వైపు పెట్టుకుంటారు. దాదాపు 90 శాతం మంది పిల్లలు ఇలాగే ఉంటారు. అయితే..ఇది బ్రెయిన్ డెవలప్ మెంట్ లో భాగమే అంటున్నారు వైద్యులు. 2017లో జరిగిన ఓ స్టడీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. మెడ కండరాలపై వాళ్లకు పూర్తిగా పట్టు వచ్చేంత వరకూ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓ సారి వాళ్లకి పూర్తిగా పట్టు వచ్చిందంటే తల ఎటు వైపు అయినా పెట్టుకుని నిద్రపోతారు. ఇది చాలా సహజం అని, అందులో కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa