ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14మంది పాక్ వాళ్లను చంపిన తెలుగు జవాన్ మురళీనాయక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 07:29 PM

జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. జమ్మూకశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లితాండ గ్రామం. మురళీ నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో కళ్లితాండలో రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క బిడ్డ ఇకలేడనే వార్త విని కన్నతల్లి కన్నీరుమున్నీరు అవుతున్నారు.


మురళీ నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ కొన్ని కీలక విషయాలను చెప్పారు. తన కుమారుడు చనిపోయేముందు పాకిస్థాన్ శత్రువులు దేశంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుని వీరమరణం పొందాడని తెలిపారు. 14మంది శత్రవుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు. ఆయన మాటల్లోనే.. 'మురళీ నాయక్ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు.. 2022 నవంబర్ 8న అగ్నివీర్‌ రిక్రూర్ట్‌మెంట్‌లో సెలక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు.. నాలుగేళ్లు అగ్రిమెంట్ ఉంది.. మురళీనాయక్ 2026 నవంబర్‌లో ముగిసేది. ఇవాళ ఆర్మీవాళ్లు నా భార్యకు ఫోన్ చేశారు.. ఆమెకు హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది.. మురళీనాయక్ చనిపోయారని నాతో చెప్పారు. కాల్పుల జరిగిన సమయంలో 14మందిని మురళీనాయక్ చంపాడని.. వాళ్లను ఎటాక్ చేసిన తర్వాత వెనక్కు తిరిగి వస్తున్నసమయంలో మురళీని ఎటాక్ చేశారనో నాతో ఆర్మీ వాళ్లు అన్నారు. ఇటీవల మురళీనాయక్‌ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు తీసుకెళ్లింది' అని వివరించారు. 14మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరూ లేరనుకుని వెనుదిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని చెబుతున్నారు.


మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీ మురళీ నాయక్ వీర మరణాన్ని జాతి మరచిపోదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 'ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదు. జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి వీర మరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై, సమర భూమిలో అమరులయ్యారు. ఈ వీరుడి తల్లితండ్రులు శ్రీమతి జ్యోతి బాయి గారికి, శ్రీ శ్రీరామ్ నాయక్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది' అని ప్రకటన విడుదల చేశారు.


మురళీ నాయక్ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెందిన మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్‌లతో ఫోన్‌లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం తెలిపారు. వీరజవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిది అయినా.. ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు.


కల్లితండాలో మురళీనాయక్ తల్లిదండ్రులను మంత్రి సవిత ఓదార్చారు.. మురళీ నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత రూ.5 లక్షల చెక్కు అందజేశారు. వీరజవాను మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి లతో ఫోన్‌లో మాట్లాడారు.. ధైర్యంగా ఉండాలన్నారు.


మరోవైపు భారత్‌-పాకిస్థాన్ ఉద్రిక్తతల దృష్ట్యా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 011-23387089, 98719 99430, 98719 99053ను ఏర్పాటు చేశారు. అదనపు సమాచారం, సహాయం కోసం డిప్యూటీ కమిషనర్‌ నంబర్‌ 98719 90081, లైజన్‌ ఆఫీసర్‌ నంబర్‌ 98183 95787' అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa