పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7 తెల్లవారుజామున 1.05 నుంచి 1.30 గంటల మధ్య భారత సైన్యం.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద శిబరిాలపై విరుచుకుపడింది. దీంతో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్త వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ సోదరి, బావమరుదులు, మేనల్లుడు సహా పది మంది కుటుంబసభ్యులు, మరో నలుగురు ముఖ్య అనుచరులు హతమయ్యారు. తాజాగా, ఆపరేషన్ సిందూర్‌లో హతమైన లష్కరే, జైషే కీలక నేతల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఐదుగురు పాక్ ఉగ్రవాదుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్త చీఫ్ మసూద్ అజార్ బావమరుదులు ఇద్దరు.(పెద్ద బావమరింది హఫీజ్ మహ్మద్ జమీల్, ఇంకో బావరమరిది మహ్మద్ యూసఫ్ అజార్), ముదాస్సర్ ఖదాయిస్ ఖాస్‌తో (లష్కరే తొయిబా) ఖలీద్, మహ్మద్ హసన్ ఖాన్ ఉన్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వీరికి పాక్ సైన్యం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అంతేకాదు, ముదస్సర్ ఖదాయిస్ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్, పాకిస్థాన్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ హాజరుకావడం గమనార్హం.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో పాక్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఉన్న బంధాన్ని మరోసారి భారత్ ప్రపంచం ముందు ఉంచింది. ఈ ఫోటోలను భారత్ అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇస్తుందనే నిర్ధారణగా చూపిస్తోంది.
ముదస్సర్ ఖద్యాన్ ఖాస్
ఖాస్, అలియాస్ అబూ జుండాల్, లష్కరే తొయిబాకు చెందిన ఇతడు పాకిస్థాన్‌లోని మురీద్‌కే ప్రాంతంలో ఉన్న మార్కజ్ తోయిబా శిబిరానికి నాయకత్వం వహించేవాడు. ఇది భారత సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2008 ముంబయి దాడుల్లో ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ కూడా ఈ శిబిరంలో శిక్షణ పొందినట్లు ఒప్పుకున్నాడు. మరో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే శిక్షణ పొందినట్టు సమాచారం.
ఖాస్ అంత్యక్రియల్లో పాక్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. సైన్యాధిపతి జనరల్ ఆసిం మునీర్, పంజాబ్ ముఖ్యమంత్రి మేరియమ్ నవాజ్ తరఫున పుష్పగుచ్ఛాలు సమర్పించారు. అంత్యక్రియల్లో పాక్ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్న అధికారి, పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ హాజరయ్యారు.
హఫీజ్ మహ్మద్ జమీల్
జమీల్ జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది. జైషే వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజహర్ బావమరిది. బహావల్‌పూర్‌లోని మార్కజ్ సుబ్హాన్ అల్లా శిబిరానికి నాయకత్వం వహించేవాడు. ఈ శిబిరంలో ఉగ్రవాదులకు ధార్మిక మత్తు కలిగిస్తూ, నిధులు సేకరించేవాడు. మే 7 దాడిలో అజహర్ కుటుంబానికి చెందిన పదిమంది, ఇతడి నలుగురు సన్నిహితులు హతమయ్యారని PTI వర్గాల సమాచారం.
మహ్మద్ యూసఫ్ అజహర్
అలియాస్ ఉస్తాద్ జీ, మహ్మద్ సలీమ్.ఇతను కూడా మసూద్ అజహర్ బావమరిది. జైషే సంస్థకు ఆయుధ శిక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తుండేవాడు. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అనేక ఉగ్రదాడులకు ఇతడి హస్తం ఉంది.. 1999లో IC-814 విమాన హైజాక్ ఘటనలో ఇతడి పాత్ర ఉంది. ఈ సంఘటన కారణంగా భారత్ మసూద్ అజహర్‌ను విడుదల చేయాల్సి వచ్చింది.
అబూ అఖాషా
అలియాస్ ఖలీద్ లష్కరే తొయిబాకు చెందిన టాప్ ఉగ్రవాడి ఇతడు అఫ్ఘనిస్థాన్ నుంచి ఆయుధాలు అక్రమంగా భారత దేశంలోకి రప్పించే కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించేవాడు. ఇతడి అంత్యక్రియలు ఫైసలాబాద్‌లో జరిగాయి. వాటికి పాక్ సైనిక ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారని వర్గాలు తెలిపాయి.
మహ్మద్ హసన్ ఖాన్
జైషే సంస్థకు చెందిన ఇతడు POK కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరి కుమారుడు. ఇతడు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడుల సమన్వయంలో కీలకంగా వ్యవహరించేవాడు.
ఈ ఐదుగురు మే 7న భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ మొదటి దశలోనే హతమయ్యారని వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ ప్రారంభించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa