ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర మూటల యుద్ధం,,,,శశి థరూర్ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 07:37 PM

పాకిస్థాన్‌తో భారత్ కాల్పుల విరమణ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన అనంతరం కాంగ్రెస్ పార్టీ.. 1971 యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వాన్ని గుర్తు చేస్తూ ప్రధానమంత్రి మోదీపై విరుచుకుపడుతోంది. ఈ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ భిన్నంగా స్పందించారు. ‘‘1971 పరిస్థితులు, 2025 పరిస్థితులు ఒకటి కావు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.


ఇందిరను కీర్తిస్తూ క్యాంపెయిన్


ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ... సోషల్ మీడియాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ప్రచారంపై ఆయన నేరుగా వ్యాఖ్యానించకుండా, ‘ఈ ఉద్రిక్తతలు అర్ధంలేనివి.. అదుపు తప్పే దిశగా వెళుతున్నాయి. శాంతి మనకు అవసరం. 1971 పరిస్థితులు, 2025 పరిస్థితులు వేరు” అని అన్నారు.


‘మన ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు.. పూంఛ్ ప్రజలను అడిగితే, ఎంత మంది చనిపోయారో తెలుస్తుంది. నేను యుద్ధాలు ఆపాల్సిందే అని చెప్పడం లేదు. అవసరం ఉన్నప్పుడు యుద్ధం కొనసాగించాలి. కానీ ఇది కొనసాగించాలని మనం ఆశించిన యుద్ధం కాదు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలన్నదే ఉద్దేశం.. అది నెరవేరింది’ అని థరూర్ స్పష్టం చేశారు.


అలాగే, పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను పట్టుకోడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘ఇది తప్పనిసరి. ఇది ఒక్క రాత్రిలో జరగదు, కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు... కానీ మనం చేయాల్సిందే. అమాయకులైన భారత పౌరులను చంపినవాళ్లను విడిచి పెట్టే అవకాశం ఉండకూడదు. కానీ, దీని కోసం దేశాన్ని దీర్ఘకాలిక యుద్ధంలోకి నెట్టడం సమంజసం కాదు’ అని అన్నారు.


యుద్ధం కాదు..అభివృద్ధి


‘పాకిస్థాన్‌తో జరిగిన ఈ ఘర్షణ విషయంలో, మరిన్ని ప్రాణాలు, సంపదలను పోగొట్టే అవసరం లేదు. భారత ప్రజల సుఖసంతోషాలపై, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఈ దశలో శాంతి మార్గంలో ముందుకు వెళ్లడమే సరైనదని నేను భావిస్తున్నాను” అని థరూర్ అన్నారు. అయితే, 1971లో ఇండిరా గాంధీ సాధించిన విజయాన్ని ఆయన గొప్ప విజయంగా పేర్కొన్నారు. ‘ఆమె ఉపఖండం భూస్వరూపాన్నే మార్చేశారు... కానీ అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పాకిస్థాన్ వేరు. వారి సామర్థ్యం, ఆయుధాలు, వాటి ప్రభావం అన్నీ భిన్నంగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.


‘బంగ్లాదేశ్ ప్రజలకు స్వేచ్ఛ కోసం 1971లో మనం ఒక నైతిక పోరాటం చేశాం.. ఇది వేరే కథ. ఇప్పుడు ఘర్షణ కొనసాగితే రెండు దేశాలకు తీవ్ర నష్టమయ్యేది. ఇది మన ప్రాధాన్యత కాదు. ఉగ్రవాదులను పంపినవారు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే అన్నదే లక్ష్యం. మే 7న ప్రారంభమైన దాడిని దీర్ఘకాలిక యుద్ధంగా మార్చాలన్న ఉద్దేశం భారత్‌కు లేదు. పాకిస్థాన్ ఉద్రిక్తత పెంచింది, మనమూ స్పందించాం. కానీ ఇది కొనసాగితే, మనం లక్ష్యములేని యుద్ధంలో చిక్కుకున్నట్లవుతుంది. 1971లో ‘బంగ్లాదేశ్‌ను విముక్తం చేయాలి’ అన్నది స్పష్టమైన లక్ష్యం. పాకిస్థాన్‌పై కాల్పులు కొనసాగించడం మాత్రం స్పష్టమైన లక్ష్యం కాదు’ అని అన్నారు.


భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన వెంటనే, కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాతో పాటు పలువురు నేతలు ఇందిరా గాంధీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రధాన మంత్రి మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. దీనిపై బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను గుర్తుచేసుకోవడం లేదేంటి? 26/11 తర్వాత యూపీఏ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?’ అని ప్రశ్నించారు.


మూడో వ్యక్తి జోక్యమా.. జైరామ్ రమేష్


కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ విభాగం అధినేత జైరామ్ రమేష్... కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రధానమంత్రి అధ్యక్షతన అన్ని పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ‘neutral site’ అనే పదాన్ని వాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘భారత్ కశ్మీర్ విషయంలో మూడో పార్టీ జోక్యానికి తలుపులు తెరిచిందా?’ అని ప్రశ్నించారు. ‘ఇందిరా గాంధీ చూపిన అసాధారణ ధైర్యం, దృఢమైన నేతృత్వం దేశ ప్రజల్ని ఈ రోజున ఆమెను గుర్తు చేసుకునేలా చేస్తోంది. అది సహజమే’ అని జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa