పాకిస్థాన్‌తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా సైనిక చర్యలకు మాత్రమే పరిమితమని, దాయాదిపై దౌత్యపరమైన ఆంక్షలు ముఖ్యంగా సిందూ నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం వర్గాలు ఉద్ఘాటించాయి. అంతేకాదు, పాక్ విమానాలకు భారత్ గగనతలం మీదుగా అనుమతి నిరాకరణ, పాకిస్థాన్ నటులు... ఆ దేశ యూట్యూబ్ ఛానెల్స్, కంటెంట్‌పై నిషేధం, వాణిజ్య సంబంధాల రద్దు కొనసాగుతుందని తేల్చిచెప్పాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం పై చర్చల ప్రతిపాదన మొదట పాకిస్థాన్ నుంచే వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత రాజీలేని వైఖరిలో ఎప్పటికీ మార్పు ఉండబోదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పునరుద్ఘాటించారు.
పాక్ దాడులపై భారత్ ప్రతిస్పందన
రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం.. భారత్ ఇప్పటికే పాకిస్థాన్ ప్రారంభించిన మిస్సైల్, డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దెబ్బకు పాకిస్థాన్ తన గగనతలాన్ని రక్షించుకోవడం కష్టసాధ్యమైందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.
పాకిస్థాన్‌కు భారీ నష్టం
భారత వైమానిక దళం మురిదీకే, బహావల్పూర్, రఫీకి, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియాలోని పాక్ సైనిక, వైమానిక స్థావరాలపై చిట్టచివరి దాడులు జరిపింది. పాస్రూర్, సియాల్‌కోట్‌లో ఉన్న రాడార్ కేంద్రాలు కూడా లక్ష్యంగా మారాయి. స్కర్దూ, సర్గోధా, జాకోబాబాద్, భోలారీ వంటి కీలక పాకిస్థాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని కమాండర్ రఘు ఆర్ నాయర్ తెలిపారు. ‘ప్రతి దుస్సాహసానికి శక్తివంతమైన ప్రతిస్పందన ఇస్తాం.. మళ్లీ ఏదైనా దాడి జరిగితే అది నిర్ణయాత్మకంగా ఎదుర్కొంటాం’ అని ఆయన అన్నారు.
కాల్పుల విరమణ ప్రకటన – ఆంతర్యం
నాలుగు రోజుల ఘర్షణల తర్వాత కాల్పుల విరమణపై మొదట ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి శనివారం సాయంత్రం 5:35కి వెలువడింది. కానీ, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రకారం.. మే 10న శనివారం రోజు 3:35 గంటలకు పాకిస్థాన్ సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ (DGMO).. భారత్ డీజీఎంఓకి ఫోన్ చేసి కాల్పుల విరమణను ప్రతిపాదించారని వెల్లడించారు. ‘ఈ రోజు మధ్యాహ్నం 3:35 గంటలకు పాక్ DGMO, భారత్ DGMOకి కాల్ చేసి, భూ, వాయు, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలు ఆపాలని కోరారు’ అని మిస్రి తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణంతో పాక్‌పై భారత్ అనేక దౌత్యపరమైన చర్యలు ప్రకటించింది. ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అత్యంత ప్రాధాన్యతగల చర్యగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనామ్ నుంచి వచ్చే నీటిని ప్రధానంగా పాక్ వినియోగిస్తుంది. కానీ భారత్ ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లో రెండు హైడ్రో ప్రాజెక్టులకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది, తద్వారా పాకిస్థాన్‌కు వెళ్లే నీటి ప్రవాహాన్ని తగ్గించింది. ఇది దాయాదిని తీవ్ర కలవరానికి గురిచేసింది. ‘65 ఏళ్లుగా భారత్ ఈ ఒప్పందాన్ని గౌరవిస్తోంది.. కానీ, పాకిస్థాన్ ప్రవర్తన పూర్తిగా దానిని పరిగణించకపోవడమే’ అని విదేశాంగ కార్యదర్శి మిస్రి వ్యాఖ్యానించారు.
యుద్ధ విధానంలో మార్పు
భవిష్యత్తులో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులను ‘యుద్ధ చర్యలుగా’ పరిగణించి, తగిన స్థాయిలో సైనిక ప్రతిస్పందన ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. అమెరికా కూడా భారత కొత్త యుద్ధ విధానాన్ని అధికారికంగా గుర్తించిందని వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa