రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నూతన రైస్ కార్డుల జారీతో పాటు ఇతర ఆరు రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సేవలను ఇప్పటికే 72,519 మంది వినియోగించుకున్నారని, మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.గుంటూరు జిల్లా తెనాలిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ నుంచి నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి ఆరు రకాల సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చాయని ఆయన వివరించారు. త్వరలో, అంటే మే 15 నుంచి, 95523 00009 నంబర్‌కు వాట్సాప్ లో "Hello" అని సందేశం పంపడం ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, జూన్ మాసంలో అర్హులైన వారందరికీ ఉచితంగా స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డులను అందజేయనున్నట్లు ప్రకటించారు.నూతన రైస్ కార్డుల జారీ ప్రక్రియలో జాప్యం గురించి వివరిస్తూ, "2024 ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో భారత ఎన్నికల సంఘం నూతన కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. ఆ తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు Ekyc నమోదు తప్పనిసరి చేయడంతో నూతన కార్డుల జారీకి కొంత ఆటంకం ఏర్పడింది. అయితే, ఇప్పటివరకు 95 శాతం Ekyc ప్రక్రియ పూర్తయినందున, ఇప్పుడు నూతన రైస్ కార్డుల జారీకి మార్గం సుగమమైంది" అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా సుమారు 4,24,59,028 మంది లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు Ekyc నుంచి మినహాయింపు ఇవ్వడంతో దాదాపు 6,45,765 మందికి ఈ ప్రక్రియ అవసరం లేకపోయిందని అన్నారు.సంస్కరణల్లో భాగంగా, Ekyc పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డును అందజేస్తామని, ఈ కార్డులో కుటుంబ సభ్యులందరి వివరాలు పొందుపరచబడతాయని మంత్రి వివరించారు. ఒంటరిగా నివసిస్తున్న వారు, 50 ఏళ్లు పైబడి వివాహం కానివారు, భార్యాభర్తల నుంచి విడిపోయినవారు, అనాథాశ్రమాల్లో నివసించే వృద్ధులు కూడా నూతన రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.మొట్టమొదటిసారిగా లింగమార్పిడి చేసుకున్న వారికి కూడా ఈ రైస్ కార్డు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పింఛను పొందుతున్న కళాకారులకు, కొండ ప్రాంతాల్లో నివసించే చెంచులు, యానాదులు వంటి 12 ఆదిమ గిరిజన తెగలకు చెందిన వారికి ప్రత్యేకంగా ఏఏవై అంత్యోదయ అన్న యోజన కార్డులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్డుల ద్వారా వారికి నెలకు 35 కిలోల బియ్యం అందజేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa