కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. ఉగ్రవాద శిబిరాలనే భారత్ టార్గెట్ చేసినప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం కయ్యానికి కాలు దువ్వింది. డ్రోన్లు, క్షిపణులను భారత నగరాల వైపు పంపింది. దీనికి భారత్ కూడా దీటుగా బదులిచ్చింది. దీంతో ఇది ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం కనిపించింది. భారత్ చేపట్టిన వైమానిక దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
పాకిస్థాన్‌పై భారత్ స్పష్టమైన ఆధిక్యం చూపుతున్న వేళ.. కాల్పుల విరమణకు మోదీ సర్కారు అంగీకరించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందనే సమాచారంతో అమెరికా రంగంలోకి దిగి ఇరు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్, పాకిస్థాన్‌లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఉపాధ్యక్షుడు వాన్స్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రాథమికంగా అమెరికాకు సంబంధించిన విషయం కాదు’’ అన్నారు. రెండు దేశాలను శాంతింపజేయడానికి అమెరికా ప్రయత్నించగలదు.. కానీ ‘ఇది అమెరికా పోరాటం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఒక్క రోజులోనే పరిస్థితి తీవ్రతను గ్రహించి.. వాన్స్, రూబియో ఇద్దరూ జోక్యం చేసుకున్నారు. పాకిస్థాన్, భారత వైమానిక దళాల మధ్య తీవ్రమైన పోరాటాలు జరిగాయని.. పాక్ 300 నుంచి 400 డ్రోన్‌లను భారత భూభాగంలోకి పంపిందని తెలియడంతో అమెరికా జోక్యం చేసుకుంది.
భారత్ రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై దాడి చేసినప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ స్థావరం పాకిస్థాన్‌కు ఒక ముఖ్యమైన సైనిక కేంద్రం మాత్రమే కాదు.. ఆ దేశ అణ్వాయుధాలను నిర్వహించే వ్యూహాత్మక ప్రణాళికల విభాగానికి కూడా దగ్గరగా ఉంది. అటువంటి ప్రదేశంలో దాడి జరిగితే అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి తెలిసిన ఒక మాజీ అమెరికా అధికారి న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు అతిపెద్ద భయం ‘దాని అణు కమాండ్ వ్యవస్థ దెబ్బతినడమే’ అని అన్నారు.
నూర్ ఖాన్‌పై దాడిని భారతదేశం నుండి వచ్చిన హెచ్చరికగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అణ్వాయుధాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే జాతీయ కమాండ్ అథారిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అయితే.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ అణు ఆయుధాల వాడకం గురించి చర్చించకూడదని అన్నారు. పెంటగాన్ ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించింది. ‘అణు శక్తులు ఘర్షణ పడి పెద్ద సంఘర్షణకు దారితీసే ఏ పరిస్థితిలోనైనా మేము ఆందోళన చెందుతాము’ అని ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు.
ఇటీవల భారతదేశ పర్యటన నుండి తిరిగి వచ్చిన వాన్స్.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నేరుగా ఫోన్ చేసి.. పరిస్థితి తీవ్రతను వివరించారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌తో రూబియో చర్చలు జరిపారు. రెండు దేశాల విదేశాంగ మంత్రులను కూడా సంప్రదించారు. ఈ చర్చల ఫలితంగా కాల్పుల విరమణ జరిగింది. కాల్పుల విరమణలో అమెరికా పాత్రను పాకిస్థాన్ ప్రశంసించింది. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa