తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు తరచూ 'రెడ్ బుక్' గురించి ప్రస్తావిస్తున్నారని గుర్తు చేస్తూ, తమ కార్యకర్తలను వేధించిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. "నేను ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోను, కానీ మా జోలికి వస్తే మాత్రం సహించేది లేదు" అని లోకేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జోన్ – 5 కోఆర్డినేటర్ కోవెలమూడి నాని, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అపూర్వ విజయం సాధించిందని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వాలు సాధించి రికార్డు సృష్టించిందని తెలిపారు. ఈ అద్భుత విజయం వెనుక కార్యకర్తల అవిశ్రాంత శ్రమ, అంకితభావం ఉన్నాయని కొనియాడారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఎన్నికలకు నెల రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించినా, కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించారని ప్రశంసించారు.పార్టీలో పాత, కొత్త తరం నాయకుల మధ్య సమన్వయం ఉండాలని, కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండి, 'తెలుగుదేశం' అనే ఒకే వర్గంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో తాను ఓటమిపాలైనా, నిరుత్సాహపడకుండా కసితో పనిచేసి చరిత్ర తిరగరాశానని గుర్తుచేశారు.కార్యకర్తలు అహంకారం విడనాడి, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అధినేత నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని, ఏదైనా అన్యాయం జరిగితే తనను గానీ, పార్టీ పెద్దలను గానీ సంప్రదించాలని సూచించారు. సమస్యలపై అంతర్గతంగా చర్చించుకుని, బయటకు వచ్చాక "జై తెలుగుదేశం" అని నినదించాలని దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa