భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో తాను భయంతో "చిన్న పిల్లాడిలా ఏడ్చాను" అంటూ వచ్చిన వార్తలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ టామ్ కరన్ ఎట్టకేలకు మౌనం వీడారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లాహోర్ ఖలందర్స్ జట్టుకు ఆడుతున్న టామ్ కరన్, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కావడం పట్ల ఊరట వ్యక్తం చేశారు. అయితే, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ రిషద్ హొస్సేన్ చేసిన ఆరోపణలను టామ్ కరన్ పూర్తిగా తోసిపుచ్చాడు. నాటి ఉద్రిక్తతల వల్ల తాను, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ తీవ్ర ఆందోళనకు గురయ్యామని రిషద్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని కరన్ స్పష్టం చేశాడు.ఈ వివాదంపై టామ్ కరన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు. క్లిష్ట సమయంలో తాను ఏడవలేదని తేల్చి చెప్పాడు. "పరిస్థితులు చక్కబడి, మళ్ళీ అంతా సవ్యంగా సాగుతుండటం సంతోషంగా ఉంది. ఈ రెండు ప్రత్యేకమైన దేశాల మధ్య శాంతి కొనసాగాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా, "అన్నట్టు, నేను ఏడవలేదని మాటిస్తున్నాను నిజానికి నేను రెడీగా ఉన్నాను అని సరదాగా పోస్ట్ చేశాడు.గతంలో రిషద్ హొస్సేన్ చేసిన వ్యాఖ్యల కారణంగా టామ్ కరన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. "అతను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాడు, కానీ అది మూసివేశారని విన్నాడు. ఆ తర్వాత చిన్న పిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు, అతన్ని ఓదార్చడానికి ఇద్దరు ముగ్గురు అవసరమయ్యారు" అని రిషద్ 'క్రిక్‌బజ్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.అయితే, ఆ తర్వాత రిషద్ హొస్సేన్ తన వ్యాఖ్యలపై టామ్ కరన్, డారిల్ మిచెల్‌లకు క్షమాపణలు చెప్పాడు. "నేను ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య గందరగోళానికి దారితీసిందని, దురదృష్టవశాత్తూ మీడియాలో తప్పుగా ప్రచారం చేయబడిందని నాకు తెలుసు. పూర్తి అవగాహన లోపం వల్ల, భావోద్వేగాలను అనవసరంగా ఎక్కువగా చేసి చెప్పాను" అని ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. "దీనివల్ల కలిగిన అపార్థానికి నేను హృదయపూర్వకంగా చింతిస్తున్నాను. డారిల్ మిచెల్, టామ్ కరన్‌లకు బేషరతుగా క్షమాపణలు తెలియజేశాను" అని వివరించాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa