భారత్‌లో అనేక ఉగ్రదాడులకు ప్రణాళిక రచించి, వాటిని అమలుపరచడంలో కీలకపాత్ర పోషించిన లష్కరే తోయిబా సీనియర్ ఉగ్రవాది రజావుల్లా నిజామనీ అలియాస్ అబు సైఫుల్లా పాకిస్థాన్‌లో హతమయ్యాడు. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సైఫుల్లాను, పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో కొందరు గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్థాన్ ఉగ్రవాదులకు అభయారణ్యంగా మారిందన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. అదే సమయంలో అక్కడి ప్రభుత్వ భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి హత్యలు జరగడం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాల నుంచి పరోక్షంగా భద్రత పొందుతున్నట్లు భావిస్తున్న అబు సైఫుల్లా, ఆదివారం మధ్యాహ్నం సింధ్ ప్రావిన్స్‌లోని మట్లీ పట్టణంలో ఉన్న తన నివాసం నుంచి బయటకు వచ్చాడు. సమీపంలోని ఓ కూడలి వద్దకు చేరుకున్న సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు అతడిని లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా కాల్పులకు తెగబడి హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్లు ఘటనా స్థలంలోని ఆధారాలు సూచిస్తున్నాయి.భారత్‌లో జరిగిన పలు భారీ ఉగ్రదాడుల్లో అబు సైఫుల్లా కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ముఖ్యంగా, 2006లో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ఇతడే ప్రధాన కుట్రదారు అని భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా, 2001లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపుర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడి, 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జరిగిన ఉగ్రదాడి ఘటనల్లోనూ సైఫుల్లా ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ముందువరుసలో ఉన్న సైఫుల్లా, పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ, అక్కడి నుంచి భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు భారత నిఘా వర్గాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. ఇతని మరణం, పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తున్నారన్న భారత్ వాదనకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూర్చింది. సైఫుల్లా హతం కావడం లష్కరే తయ్యిబా సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు
![]() |
![]() |