ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్ష బృందం విదేశీ పర్యటనలు.. ఆ 33 దేశాలకే

national |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:22 PM

ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు భారత్ దౌత్య పరంగా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలను అంతర్జాతీయంగా బహిర్గతం చేసేందుకు.. దేశంలోని పలు రాజకీయ పార్టీల నుంచి నేతలను తీసుకుని వారితో 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా 7 భారతీయ దౌత్య బృందాల్లో రెండు టీమ్‌లు ఇవాళ విదేశాలకు పయనం అయ్యాయి. ఈ రెండు దౌత్య బృందాలు జపాన్, యూఏఈలో పర్యటించనున్నాయి. ఈ టీమ్‌లకు జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వం వహించనున్నారు.


జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, హేమాంగ్ జోషి, ప్రదాన్ బారువా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ.. సీపీఎంకు చెందిన జాన్ బ్రిట్టాస్, మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్.. మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ ఉన్నారు.


 శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరో బృందం యూఏఈ, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్, లైబీరియా దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు బన్సూరీ స్వరాజ్, అతుల్ గార్గ్, మన్నన్ కుమార్ మిశ్రా, మాజీ ఎంపీ ఎస్.ఎస్. అహ్లువాలియా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ ఇ.టి. మహమ్మద్ బషీర్, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర, మాజీ దౌత్యవేత్త సుజన్ చినోయ్ ఉన్నారు.


ఉగ్రవాదం పాకిస్తాన్ ప్రభుత్వ విధానమని జేడీయూ ఎంపీ సంజయ్ ఝా పేర్కొన్నారు. గత 40 ఏళ్లుగా పాక్ ఉగ్రవాద విధానాల వల్ల బాధపడుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇప్పుడు పాకిస్తాన్‌ ఉగ్రకుట్రలను బయటపెడుతుందని తెలిపారు. ఈ దౌత్యపరమైన పర్యటన మరో లక్ష్యం పాకిస్తాన్ చేస్తున్న అణ్వస్త్ర బెదిరింపులను ఖండించడమేనని తేల్చి చెప్పారు. అలాగే సింధు జలాల ఒప్పందం రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సహకారంపై ఆధారపడి ఉందని.. అయితే స్నేహం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా దానికి పాకిస్తాన్‌తో సంబంధం ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడా దొరకలేదని.. చివరికి పాకిస్తాన్‌లోనే అమెరికా దొరికబట్టిందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఆధారపడి జీవిస్తోందని.. దీన్ని మనం బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు.


భారత పార్లమెంటుపై దాడి ఘటన దగ్గరి నుంచి 26/11 ముంబై దాడుల వరకు పాకిస్తాన్ 30 ఏళ్ల 'టెర్రర్ రికార్డు'ను అంతర్జాతీయ సమాజం ముందు బహిర్గతం చేయాలని దౌత్య బృందాలకు బాధ్యత అప్పగించినట్లు బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ తెలిపారు. మొదట సర్జికల్ స్ట్రైక్స్ చేశామని.. అయితే అది వారికి అర్థం కాలేదని.. ఆ తర్వాత బాలాకోట్ చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ద్రవ్యోల్బణం, ఆకలితో పోరాడుతోందని.. బలూచిస్తాన్ కూడా వారి నియంత్రణ నుంచి జారిపోతోందని వెల్లడించారు. వారి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ దృష్టి మరల్చడానికి 26 మంది అమాయకులను వారి మతాన్ని అడిగి హత్య చేయమని ఆదేశించారని బ్రిజ్ లాల్ ఆరోపించారు.


దేశంలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన ఈ 7 దౌత్య బృందాల్లో మూడింటికి విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మంగళవారం పలు అంశాలు చెప్పారు. అదే సమయంలో ఆ 33 దేశాలను ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా వెల్లడించారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి తెలిపారు. భారత దౌత్య బృందాలు పర్యటించే ఆ 33 దేశాల్లో 15 దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సభ్యదేశాలు (5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్యదేశాలు) అని వెల్లడించారు. మిగిలినవి భవిష్యత్తులో భద్రతా మండలిలో చేరబోయే దేశాలని చెప్పారు. వీటితోపాటు అంతర్జాతీయ అంశాలపై భారత వైపు మొగ్గు చూపే దేశాలను ఎంచుకున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa