ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ఉగ్రదాడుల్లో 20 వేల మంది భారతీయులు చనిపోయారు

international |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 08:57 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ను గట్టి దెబ్బ కొట్టేందుకు భారత్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. అయితే దీనిపై పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని శనివారం ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తిప్పికొట్టింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్.. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతు గురించి బహిర్గతం చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ పూర్తిగా మద్దతును నిలిపివేసే వరకు 65 ఏళ్ల క్రితం జరిగిన సింధు నదీ జలాల ఒప్పందం నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ప్రపంచంలో ఏ మూలన ఉగ్రదాడి జరిగినా దానికి మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయని.. ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా పాకిస్తాన్ ఉంటుందని పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు.


గత 65 ఏళ్లలో పాకిస్తాన్ ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించి 3 యుద్ధాలు.. వేల సంఖ్యలో ఉగ్రదాడులకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితిలో పర్వతనేని హరీష్ ఆరోపించారు. ఒప్పంద నిబంధనల్లో మార్పులను నిరోధించడం ద్వారా పాకిస్తాన్ తన బాధ్యతలను పూర్తిగా విస్మరించిందని.. చివరకు ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక చర్యలకు అది దారితీసిందని వెల్లడించారు. సింధు నదీ జలాల ఒప్పందం విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తిన పాకిస్తాన్ ప్రతినిధి.. "నీరు జీవం, యుద్ధ ఆయుధం కాదు" అని వ్యాఖ్యానించిన తర్వాత దానికి కౌంటర్‌గా పర్వతనేని హరీష్ తిప్పికొట్టారు. ఎగువన ఉన్న దేశంగా భారత్ ఎప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ నిజస్వరూపాన్ని తెలిపే నాలుగు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.


ఒప్పందాలను ఉల్లంఘించడం


65 ఏళ్ల క్రితం సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఒక మంచి విశ్వాసంతో భారత్ కుదుర్చుకుందని.. ఆ ఒప్పందం ప్రవేశిక ఎంత స్నేహ భావంతో ఎలా ముగించారో వివరిస్తుందని పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. అయితే గత ఆరున్నర దశాబ్దాలుగా భారతదేశంపై పాకిస్తాన్ 3 యుద్ధాలు, వేలాది ఉగ్రదాడులను చేసి ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించిందని తెలిపారు. గత 4 దశాబ్దాల్లో పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడుల్లో 20 వేల మందికి పైగా భారతీయులు మరణించారని వెల్లడించారు. ఈ 40 ఏళ్లలో భారత్ అసాధారణ సహనాన్ని, ఔదార్యాన్ని ప్రదర్శించిందని తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వ సహాయంతో సరిహద్దు ఉగ్రవాదం భారత పౌరుల జీవితాలు, మత సామరస్యం, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని తేల్చి చెప్పారు.


ప్రాథమిక మార్పులు


ఈ 65 ఏళ్లలో సరిహద్దు ఉగ్రదాడుల ద్వారా రెండు దేశాల మధ్య భద్రతాపరమైన ఆందోళనలు పెరగడం మాత్రమే కాకుండా.. స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి, వాతావరణ మార్పు, జనాభా మార్పు కోసం పెరుగుతున్న అవసరాలపరంగా కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయని భారత రాయబారి తెలిపారు. ఆపరేషన్ల భద్రత, సామర్థ్యం.. నీటి వినియోగాన్ని నిర్ధారించడానికి ఆనకట్ట మౌలిక సదుపాయాల కోసం టెక్నాలజీ పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. కొన్ని పాత డ్యామ్‌లు తీవ్రమైన భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్ ఈ మౌలిక సదుపాయాలకు ఎలాంటి మార్పులను, ఒప్పందం కింద నిబంధనల సవరణలను అడ్డుకుంటోందని తెలిపారు. 2012లో జమ్మూ కాశ్మీర్‌లోని తులబుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఉగ్రదాడులు భారత ప్రాజెక్ట్‌ల భద్రతను, పౌరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయని వెల్లడించారు.


పాకిస్తాన్ తిరస్కరణ


గత రెండేళ్లలో అనేక సందర్భాలలో మార్పులపై చర్చించడానికి పాకిస్తాన్‌ను భారత్ అధికారికంగా అడిగితే.. పాకిస్తాన్ తిరస్కరిస్తూనే ఉందని హరీష్ పర్వతనేని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానంతో.. భారత్ చట్టబద్ధమైన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడాన్ని అడ్డుకుంటోందని వెల్లడించారు.


ఒప్పందం నిలిపివేత


ఈ నేపథ్యంలోనే భారత్ చివరికి ఈ సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేసినట్లు ప్రకటించిందని తెలిపారు. ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును నిలిపివేసే వరకు.. ఈ ఒప్పందం అలాగే రద్దు చేసి ఉంటుందని ప్రకటించారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తానే అని స్పష్టమవుతోందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa